విధాత: రోల్స్‌రాయిస్, పోర్షియో లాంటి ఖరీదైన లగ్జీరియస్ కార్లను కొనుక్కోవాలని చాలా మందికి ఉన్నా ఆ కలను నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యపడదు. అందుకే కొంత మంది ఔత్సాహికులు సాధారణ కార్లనే ఖరీదైన బ్రాండెడ్ కార్లగా మార్చడానికి ప్రయత్నించి వార్తల్లో నిలుస్తారు. అలాంటి వ్యక్తే కేరళ (Kerala) కు చెందిన హదీఫ్ సయీద్.
కార్లను ఇప్పి బిగించడం, వాటికి అదనపు హంగులు చేర్చడం అంటే ఇతడికి చాలా ఆసక్తి. ఆ ఆసక్తితోనే మధ్యతరగతి ఎక్కువగా ఉపయోగించే మారుతి 800 కారును ధనవంతులు మాత్రమే కొనగలిగే విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారులా మార్చేశాడు. అంతే కాకుండా రోల్స్‌రాయిస్ లోగోనే స్ఫూర్తిగా తీసుకుని కొత్త లోగోను సృష్టించాడు. రోల్సరాయిస్ కారులా మార్చడానికి మారుతి కారు ఇంటీరియర్ మొత్తాన్ని కొత్తగా తయారుచేశాడు.
కారు ముందటి భాగాన్ని ఇప్పేసి.. కొత్త మెటిరీయల్‌తో డిజైన్ చేసిన భాగాన్ని అతికించాడు. రోల్స్‌రాయిస్‌కు ఉన్నట్లు హెడ్‌లైట్లు, లుక్ వచ్చేలా జాగ్రత్తపడ్డాడు. దీనికోసం భారీ మెటల్ షీట్లు, ఇతర కార్ల నుంచి వివిధ భాగాలను తీసుకున్నానని హదీఫ్ తెలిపాడు. దృఢంగా ఉండేందుకు అతికింపుల్లో వెల్డింగ్ పద్ధతిని అనుసరించానని చెప్పాడు.
ఈ మొత్తం తయారీకి తనకు సుమారు రూ.45 వేలు అయిందని వెల్లడించాడు. ఈయన గతంలో మోటార్ సైకిల్ ఇంజిన్‌తో జీప్ తయారుచేసి వార్తల్లో నిలిచాడు. ఈ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ట్రిక్స్ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. కొన్ని నెలల పాటు కృషి చేసి తయారుచేసిన రోల్స్ రాయిస్ కారు వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ఇప్పటికి మూడు లక్షల మంది చూశారు.