Karnataka Polls | కర్ణాటకలోని 20 శాతం సీట్లలో.. తెలుగు వారి ఓట్లే కీలకం

Karnataka polls | కర్ణాటక మొత్తం ఏడు కోట్ల జనాభాలో కోటి మంది తెలుగు వారే 40-50 నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో.. విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే వారి భవితవ్యాన్ని తేల్చేవారిలో తెలుగు వారు కూడా కీలకం కాబోతున్నారు. దాదాపు 20 శాతం నియోజకవర్గాల్లో తెలుగువారు గణనీయ సంఖ్యలో ఉన్నారని కర్ణాటకలోని తెలుగు సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగువారిని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్రంలోని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ల్లోని కీలక […]

  • Publish Date - April 1, 2023 / 12:31 AM IST

Karnataka polls |

  • కర్ణాటక మొత్తం ఏడు కోట్ల జనాభాలో కోటి మంది తెలుగు వారే
  • 40-50 నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో..

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే వారి భవితవ్యాన్ని తేల్చేవారిలో తెలుగు వారు కూడా కీలకం కాబోతున్నారు. దాదాపు 20 శాతం నియోజకవర్గాల్లో తెలుగువారు గణనీయ సంఖ్యలో ఉన్నారని కర్ణాటకలోని తెలుగు సంఘాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగువారిని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్రంలోని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ల్లోని కీలక పార్టీలైన టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలను ఆశ్రయిస్తున్నాయని తెలుస్తున్నది.

కర్ణాటక మొత్తం జనాభా ఏడు కోట్లు ఉంటే.. అందులో దాదాపు కోటిమంది తెలుగువారే ఉన్నారని కర్ణాటక, బెంగళూరుల్లోని తెలుగు సంఘాలు చెబుతున్నాయి. వీరిలో కొంతమంది దశాబ్దాల క్రితమే ఇక్కడ స్థిరపడిపోయినవారు ఉన్నారు, వివిధ ఉద్యోగాల కోసం ప్రత్యేకించి బెంగళూరు (Banglore) లో సాఫ్ట్‌వేర్‌ జాబులకోసం, వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ కోసం వచ్చినవారూ ఉన్నారు.

ఒక్క బెంగళూరులోనే 25 లక్షల మంది తెలుగువారు ఉన్నారని తెలుగు సంఘాలు చెబుతున్నాయి. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత మూడో భాషగా తెలుగు ఉన్నది. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో తెలుగువారు గణనీయ సంఖ్యలో ఉన్నప్పటికీ.. బెంగళూరులోని మహదేవపుర వంటి పది స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించగలిగే శక్తిని కలిగి ఉన్నారని కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్‌ నేతలు చెబుతున్నారు.

హెబ్బల్, యలహంక, దేవనహళ్లి, బళ్లారి వంటివి ఏపీ సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గాలతోపాటు హైదరాబాద్‌ – కర్ణాటక ప్రాంతంలోని బీదర్‌, కలబురగి, రాయిచూర్‌, యాద్గీర్‌, తూమకూరు, చిత్రదుర్గ, చిక్‌బళ్లాపూర్‌ వంటి చోట్ల తెలుగువారు బలంగా ఉన్నారని అంటున్నారు.

తెలుగువారు నిర్ణయాత్మక శక్తిగా ఉండటంతో ఓట్లలో స్వల్ప తేడా వచ్చినా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో తెలుగువారికి కూడా వివిధ సంక్షేమ పథకాలపై నేతలు హామీలు ఇస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బెంగళూరు నగరంలో తెలంగాణ భవన్‌కు స్థలం ఇస్తామని జేడీఎస్‌ వాగ్దానం చేసిన సంగతిని పలువురు గుర్తు చేస్తున్నారు.

కొన్ని పార్టీలు ఎన్నికల సంవత్సరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తెలుగు సంఘాలకు విరాళాలు ఇస్తుంటాయి కూడా. మరి ఈ ఎన్నికల్లో ఎవరెవరి భవితవ్యాన్ని తెలుగువారు మార్చనున్నారో ఫలితాలు వచ్చే వరకూ వేచిచూడాలి