Ind vs SL |
కొన్నాళ్లుగా టీమిండియాకి దూరంగా ఉన్న బుమ్రా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టుతో కలవడం, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మాయాజాలం చేస్తుండడంతో ఆసియాకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆసియా కప్ లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని ఫైనల్‌లో అడుగు పెట్టింది.
సోమవారం పాక్‌తో ఆడి భారీ మెజార్టీతో గెలుపొందిన భారత్ శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో గెలుపొంది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేసిన.. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో చివరకి భారత్ పట్టు సాధించడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ని దునిత్ వెల్లలాగే తన స్పిన్ మాయాజాలంతో వణికించాడు. కీలకమైన 5 వికెట్లు తీసి పెద్ద దెబ్బతీసాడు.. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) మరో హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. ఇక చివర్లో అక్షర్ పటేల్(26), సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేయడంతో భారత్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ చేసింది.
214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకని భారత్ 41.3 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ చేయడం విశేషం. దీంతో వరుసగా 13 వన్డేల తర్వాత శ్రీలంక తొలి పరాజయాన్ని చవి చూసింది. మొదట్లో బుమ్రా.. శ్రీలంకకి చుక్కలు చూపించా, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పిన్ తో శ్రీలంక వణికిపోయింది.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తలా రెండేసి వికెట్లు తీసారు.ఇక మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో టీమిండియా ఆసియాకప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా, శుక్రవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా కూడా ఫైనల్ బెర్త్‌కు చేరుకోవడంలో ఎలాంటి ఢోకా లేదు.