పాక్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

వన్డే ప్రపంచకప్‌ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భార‌త్ చిత్తుగా ఓడించింది. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 32.3 ఓవ‌ర్ల‌కే ఛేదించింది.

పాక్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

* 42.5 ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ 191 ప‌రుగుల‌కు ఆలౌట్‌

* 32.3 ఓవ‌ర్ల‌కే ల‌క్ష్యాన్ని ఛేదించిన ఇండియా

* అహ్మ‌దాబాద్ వేదిక‌గా చెల‌రేగిన రోహిత్‌

* ప్ర‌పంచక‌ప్‌లో పాక్‌పై 8 సార్లు గెలిచిన భార‌త్‌

* ప్ర‌పంచ‌క‌ప్‌-2023లో ఇండియా హ్యాట్రిక్ విజ‌యం


విధాత‌, హైద‌రాబాద్‌: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన‌ హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భార‌త్ చిత్తుగా ఓడించింది. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 32.3 ఓవ‌ర్ల‌కే ఛేదించింది. భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరడజను ఫోర్లు, అరడజను సిక్సర్లతో చెల‌రేగిపోయారు. 63 బంతుల్లో 86 ప‌రుగులు చేశారు. ఓపెన‌ర్ శుభ‌మ‌న్ గిల్ 11 బంతుల్లో 16 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. త‌రువాత వ‌చ్చిన విరాట్ కోహ్లీ కూడా 18 బంతుల్లో 16 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. త‌రువాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యారు నిల‌క‌డ‌గా ఆడారు. 62 బంతుల్లో 53 ప‌రుగులు (నాటౌట్‌) చేశారు. చివ‌రి బంతిని ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించారు. ఐదో వికెట్‌గా వ‌చ్చిన కే.ఎల్‌. రాహుల్ శ్రేయాస్ అయ్యార్ అర్ధ శ‌త‌కానికి స‌హ‌క‌రించేవిధంగా సింగ‌ల్ ర‌న్స్‌తో స‌పోర్ట్ చేశారు. 29 బంతుల్లో 19 ప‌రుగులు (నాటౌట్‌) చేశారు.


టాస్ గెలిచి భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు. ఒక దశలో 155/2తో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న పాకిస్థాన్‌కు టీమిండియా బౌలర్లు కళ్లెం వేశారు. దీంతో 42.5 ఓవర్లలో పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌటైంది. శార్దూల్ మినహా భారత బౌలర్లందరూ ఆకట్టుకున్నారు. 41 పరుగుల వద్ద అబ్దుల్లా షఫీఖ్ వికెట్‌ను కోల్పోయిన పాకిస్థాన్ ఆ తర్వాత పుంజుకుంది. ఇమాముల్ హక్ (36) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ కలిశాడు. అతడు జడేజా బౌలింగ్‌లో అవుటైనట్లు అంపైర్ ప్రకటించినా రివ్యూ ద్వారా లైఫ్ సంపాదించాడు. దీంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజమ్ (50 ప‌రుగులు) అవుటైన తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ త్వరగా కుప్పకూలింది.

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌ను ఓడించిన భారత్ మూడో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పైనా విజయం సాధించింది.


దాయాదిపై 8వ సారి కూడా గెలుపు


వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా హ్యాట్రిక్ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌ను ఓడించిన భారత్ మూడో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పైనా తిరుగులేని విజయం సాధించింది. దీంతో వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో 6 పాయింట్ల‌తో అగ్రస్థానానికి చేరుకుంది. మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (50), రిజ్వాన్ (49) మాత్ర‌మే పాక్ జ‌ట్టు నుంచి కొంత మెరుగైన స్కోరు చేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, హార్దిక్ 2, సిరాజ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లతో ఆకట్టుకున్నారు.


1992 నుంచి పాక్‌పై భార‌త్ రికార్డు విక్ట‌రీ


ఒకటి కాదు.. రెండు కాదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది. రెండు జట్లు 8 సార్లు తలపడితే 8 సార్లు భారత్‌నే విజయం వరించింది. ప్రతిసారి పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 134 వన్డే మ్యాచ్‌ల్లో తలపడితే పాకిస్థాన్ 73, భారత్ 56 సార్లు గెలిచాయి. 1992 ప్రపంచకప్‌లో 43 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా 1996 ప్రపంచకప్‌లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1999 ప్రపంచకప్‌లో 47 పరుగుల తేడాతో గెలవగా.. 2003 ప్రపంచకప్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2011 ప్రపంచకప్‌లో 29 పరుగుల తేడాతో గెలవగా.. 2015 ప్రపంచకప్‌లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2019 ప్రపంచకప్‌లో 89 పరుగుల తేడాతో గెలవగా.. 2023 ప్రపంచకప్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.