Infosys Techie | విధాత: ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శనివారం రాత్రి పుణె శివార్లలోని ఓ హోటల్‌లో హత్యకు గురైంది. హోటల్ గది నుంచి మహిళ ప్రియుడిని బయటకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది.
పోలీసుల వివరాల ప్రకారం.. పింప్రి చించ్‌వాడ్‌లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్‌లో కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేలపై మృతదేహం, గదిలో రక్తపు మరకలు కనిపించాయి. చనిపోయిన మహిళను వందనా ద్వివేదిగా, ఆమె ప్రియుడిని రిషబ్ నిగమ్‌గా గుర్తించారు. ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. పోలీసుల దర్యాప్తులో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలే హత్యకు దారితీసినట్టు వెల్లడైంది.
హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రిషబ్ అర్థరాత్రి గది నుంచి బయటకు రావడం పోలీసులకు కనిపించింది. దీంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేసి పారిపోతున్న రిషబ్‌ను పట్టుకున్నారు. మరింత సమాచారం కోసం నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. “హోటల్ రూమ్ బుకింగ్ వందన, రిషబ్ పేరు మీద జరిగింది. కాబట్టి అతను మా ప్రధాన నిందితుడు. తదుపరి విచారణ కొనసాగుతున్నది” అని సీనియర్ పోలీసు అధికారి విశాల్ హైర్ మీడియాకు తెలిపారు.