బీజేపీ గెలుపు రహస్యం.. అదేనా?
విభజన రాజకీయంతోనే బీజేపీ మనుగడ? విధాత: బీజేపీ గెలుపు రహస్యం తెలిసింది. మెజారిటీ వాదంతో ఓ మతాన్ని బూచిగా చూపించి మాత్రమే ఓట్లు దండుకొంటున్నదని తెలిసి వచ్చింది. మైనారిటీ మత జనాభా కనిష్టంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆటలు, మాటలు చెల్లటం లేదని తేలింది. ఈ మధ్య జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యం దీన్నే రుజువు చేస్తున్నది. గుజరాత్‌లో గెలిచి, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి పాలవటానికి మోదీ-పరివార్ శక్తులు అనుసరించే మత […]

- విభజన రాజకీయంతోనే బీజేపీ మనుగడ?
విధాత: బీజేపీ గెలుపు రహస్యం తెలిసింది. మెజారిటీ వాదంతో ఓ మతాన్ని బూచిగా చూపించి మాత్రమే ఓట్లు దండుకొంటున్నదని తెలిసి వచ్చింది. మైనారిటీ మత జనాభా కనిష్టంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఆటలు, మాటలు చెల్లటం లేదని తేలింది. ఈ మధ్య జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యం దీన్నే రుజువు చేస్తున్నది. గుజరాత్‌లో గెలిచి, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి పాలవటానికి మోదీ-పరివార్ శక్తులు అనుసరించే మత రాజకీయానికి భూమిక లేకపోవటమే ప్రధాన కారణం.
గుజరాత్ విషయానికి వస్తే..
బ్రాహ్మణ్ బనియా పార్టీగా పేరున్న బీజేపీకి గుజరాత్‌లో క్షత్రీయులు (కోలీ) ప్రధాన వనరు. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి బీజేపీకి పాటిదార్లు (పటేళ్లు) కలిసి వచ్చారు. వీరి శాతం గుజురాత్‌లో 12నుంచి 14 శాతం ఉంటుంది. దీనికి తోడు ఎల్లప్పుడు వనరుగా వాడుకొనే మతం (ముస్లిం) ఉండనే ఉన్నది. వీరు 9.67శాతం ఉంటారు. ఈ మైనారిటీ కార్డుకు తోడు పాటిదార్ల అండతో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విజయం అందుకొన్నది.
అదే హిమాచల్ ప్రదేశ్ చూస్తే..
ఆ రాష్ట్రంలో మైనారిటీ కార్డుకు అవకాశం లేదు. హిమాచల్‌లో మెజారిటీ మతంగా హిందువు జనాభా 95.17 శాతం. ముస్లింలు 2.18శాతం, క్రిష్టియన్లు 1.16 శాతం మాత్రమే. ఈ క్రమంలో బీజేపీకి మత రాజకీయం చేయటానికి ఆస్కారం లేకుండా పోయింది. మరో వైపు సామాజిక సమూహాల గణాంకాలు కూడా బీజేపీకి కలిసి వచ్చే విధంగా లేవు.
ఎస్సీలు- 25.2శాతం, ఎస్టీలు- 5.7శాతం, బీసీలు-13.5శాతం ఉంటే, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, ఠాగూర్లు 18శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కులం పునాదిగా ఓట్లను సమీకరించుకోవటం, మతం పునాదిగా జలను రెచ్చగొట్టటం కానీ చేయలేక పోయింది. తత్ఫలితంగానే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా హిమాచల్‌లో ఓటర్లను తమ వైపు తిప్పుకోలేక చతికిల పడింది.
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా..
మైనారిటీ మత బూచితో మాత్రమే బీజేపీ పాగా వేస్తున్నట్లు అర్థమవుతున్నది. దానికి కర్ణాటక కూడా ఓ ఉదాహరణ. కర్ణాటకలో 12శాతానికి పైగా ముస్లింలు ఉంటారు. వీరి ఉనికిని చూపి మాత్రమే బీజేపీ రాజకీయం చేస్తున్నది. 14నుంచి 15శాతంగా ఉన్న లింగాయత్‌ల అండతో దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కర్ణాటకలో అధికారం చేజిక్కించుకున్నది.
దాన్ని నిలుపుకోవటం కోసమే.. ఎక్కడా లేని విధంగా హిజాబ్ వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఫలితంగా మత విభజనతో లబ్ధి పొందజూస్తున్నది. మైనారిటీ మతాన్ని చూపి మెజారిటీ ప్రజల ఓట్లను తమవైపు తిప్పుకోవటం బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం. ఈ మత బూచీ లోని బూటకాన్ని ప్రజల్లో విప్పిచెప్పినప్పుడు బీజేపీకి నూకలు చెల్లిపోతాయనటంలో సందేహం లేదు.