గోవులను కబేళాలకు అమ్ముకుంటోంది.. ఇస్కాన్‌పై భాజపా ఎంపీ మేనకాగాంధీ సంచలన ఆరోపణ

విధాత: ప్రపంచ ప్రఖ్యాత కృష్ణ భక్త సంస్థ ఇస్కాన్ (ISKCON) పై భాజపా ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంస్థ తన గోశాలలోని ఆవులను కబేళాలకు అమ్మేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ప్రపంచవ్యాప్తంగా కృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తుంది. అంతే కాకుండా గో రక్షణను చేపడుతుంది. దీంతో ఈ సంస్థపై మేనకాగాంధీ స్థాయి వ్యక్తి తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఎంపీగా కంటే జంతు ప్రేమికురాలిగా మేనకా గాంధీ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. వైరల్ అవుతున్న వీడియోలో.. ‘భారత దేశంలో జరుగుతున్న అతి పెద్ద మోసం ఇస్కాన్.
ప్రభుత్వాల నుంచి పౌరుల నుంచి పెద్ద ఎత్తున విరాశాలు, పన్ను మినహాయింపులు పొందుతూ వారు గోశాలలు నిర్వహిస్తున్నారు. నేను ఇటీవలే అనంత్‌పుట్ గోశాలను సందర్శించా. అక్కడ ఒక్క ఒట్టిపోయిన ఆవు కూడా లేదు. ఒక్క దూడ లేదు. అన్నీ పాలిచ్చే ఆవులే. గోశాల ముసుగులో ఆ సంస్థ డెయిరీలను మాత్రమే నిర్వహిస్తోంది. ఒట్టిపోయిన వాటిని కబేళాలకు అమ్మేస్తోంది’ అని మేనక గాంధీ అన్నట్లు ఉంది.
అయితే ఈ వీడియోపై ఇస్కాన్ స్పందించింది. ‘మేనకా గాంధీ ఆరోపణలు షాక్ కలిగించాయని పేర్కొంది. వీటిని పూర్తిగా ఖండిస్తున్నామని ప్రకటించింది. గోవులు, ఎద్దుల సంరక్షణలో ఇస్కాన్ ముందుండి పోరాడుతోంది. ఇండియాలోనే కాదు గో మాంసం తినే దేశాల్లోనూ ఆవులను రక్షిస్తున్నాం.
అంతే కానీ వధశాలలకు అమ్మేస్తున్నామన్న ఆరోపణలు సత్యదూరం’ అని ఇస్కాన్ అధికార ప్రతినిధి యుధిష్ఠర్ గోవింద దాస్ ఎక్స్‌లో స్పందించారు. భారత్‌లో తాము ప్రత్యక్షంగా 60 గోశాలలను నిర్వహిస్తున్నామని, అక్కడ ఉన్న ఆవులన్నీ రైతులు వదిలేసినవి, గాయపడినవి అని ఆయన తెలిపారు.