Isle Royale | నాశనమైన అడవిని.. పునఃనిర్మించిన ఒంటరి తోడేలు..
Isle Royale | విధాత: సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం.. అడవిలోకి ఒంటరిగా వచ్చిన ఒక తోడేలు (Lone Wolf) అక్కడి పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా అంతరించిపోతున్న జీవజాలాన్ని రక్షించింది. ఇక ఇక్కడి జీవావరణం నాశనమైందనుకున్న దశలో హీరోలా ఎంట్రీ ఇచ్చి.. దట్టమైన అడవి ఏర్పడేందుకు కారణమైంది. కెనడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజా నివేదిక బయటకు వచ్చింది. జంతువుల్లో ఇన్‌బ్రీడింగ్ (రక్త సంబంధీకులతో జతకట్టడం) వల్ల పర్యావరణానికి తలెత్తే సమస్యలను ఈ నివేదిక సోదాహరణంగా […]
Isle Royale |
విధాత: సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం.. అడవిలోకి ఒంటరిగా వచ్చిన ఒక తోడేలు (Lone Wolf) అక్కడి పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా అంతరించిపోతున్న జీవజాలాన్ని రక్షించింది. ఇక ఇక్కడి జీవావరణం నాశనమైందనుకున్న దశలో హీరోలా ఎంట్రీ ఇచ్చి.. దట్టమైన అడవి ఏర్పడేందుకు కారణమైంది. కెనడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజా నివేదిక బయటకు వచ్చింది. జంతువుల్లో ఇన్‌బ్రీడింగ్ (రక్త సంబంధీకులతో జతకట్టడం) వల్ల పర్యావరణానికి తలెత్తే సమస్యలను ఈ నివేదిక సోదాహరణంగా వివరించింది.
కెనడా (Canada) దేశానికి ఆనుకుని 400 ద్వీపాల సమూహంతో కూడిన ఐల్ రాయిలే నేషనల్ పార్క్ (Isle Royale) ఉంటుంది. ఇది అమెరికాలో ఉన్నప్పటికీ కెనడాను ఈ నేషనల్ పార్క్‌ను సన్నని మంచు మార్గం ఒకటి కలుపుతుంది. దీనికి సమీపంలోనే మిషిగన్ సరస్సు ఉండటంతో ఇక్కడి వైవిధ్యభరితమైన జీవజాలం కనిపిస్తుంది. తోడేళ్లు ఈ ప్రాంతంలోకి ముందుగా 1940ల ప్రాంతంలో వచ్చాయని అంచనా. వాటి ప్రధాన ఆహారం భారీ సైజులో ఉండే దుప్పులు.
ఈ దుప్పులు (Mooses) తమ భారీ కడుపును నింపుకోవడం కోసం గడ్డి, ఒక స్థాయి మొక్కలను సైతం హాంఫట్ చేసేసేవి. తోడేళ్లు ఎప్పటికప్పుడు వాటిని వేటాడుతూ ఉండటంతో దుప్పుల సంఖ్య సురక్షిత స్థాయిలో ఉండి.. అడవి సమతుల్యంగా ఉండేది. అయితే 1980లో పరిస్థితి పూర్తిగా తిరగబడింది. కెనైన్ పార్వోవైరస్ బారిన పడటంతో తోడేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. 50కి పైగా ఉండే వాటి సంఖ్య ఏకంగా 12కి పడిపోయింది. కొంతకాలానికి ఆ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. వాటి సంఖ్య మాత్రం వృద్ధి చెందలేదు.
చాలా చిన్న సమూహం అయిపోవడంతో సంతానికి జన్యు వైవిధ్యత లేకుండా పోయింది. దీంతో వెన్ను సంబంధిత వ్యాధులతో పుట్టడం, పుట్టినవి కొన్ని రోజులకే మరణించడంతో తోడేళ్ల సంఖ్య నానాటికి కనుమరుగవుతూ వచ్చింది. ఉన్నవీ బలహీనంగా ఉండటంతో తమకన్నా ఎనిమిది రెట్ల బరువుండే దుప్పులను వేటాడటం అసాధ్యమయ్యేది. దీంతో దుప్పుల సంఖ్య పెరిగిపోయింది. కనిపించిన మొక్కను, గడ్డిని తినేస్తుండటంతో జీవవైవిధ్యం దెబ్బతిని చాలా జంతువులు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది.
హీరో వచ్చాడు..
ఈ క్రమంలో 1997 నాటికి ఐల్ రాయిలే నేషనల్ పార్క్ పరిస్థితి దారుణంగా మారింది. సరిగ్గా అదే సమయంలో మాంచి శరీరంతో, వయసులో ఉన్న మగ తోడేలు ఒకటి కెనడా నుంచి సన్నని బ్రిడ్జ్ దాటుకుంటూ ఈ నేషనల్ పార్క్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న తోడేళ్లకు దీనికి ఏమాత్రం సంబంధం లేకపోవడంతో వాటి జన్యువుల మధ్య వైవిధ్యం ఉంది. ఇది అక్కడ దుప్పులను వేటాడటమే కాకుండా ఈ ప్రాంతపు ఆడ తోడేళ్లతో జతకట్టి సంతానాన్ని వృద్ధి చేసింది.
సుమారు ఇది 34 మంది తోడేళ్లకు తండ్రి అని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి తోడేళ్ల సంఖ్య వృద్ధి చెందడం.. తదనుగుణంగా దుప్పులు పరిమిత స్థాయిలో ఉండటంతో .. జీవవైవిధ్యం పెరిగి అడవి మళ్లీ గత వైభవాన్ని అందుకుంది. ఎం93 అనే సాంకేతిక నామంతో పిలిచే ఈ తోడేలుకు ఓల్డ్ గ్రే గాయ్ (Old Gray Guy) అనే ముద్దు పేరు కూడా ఉంది.
కథ మళ్లీ అడ్డం తిరిగింది..
ఎం93 తీసుకొచ్చిన మార్పు ఓ దశాబ్దం వరకు బాగానే కనిపించింది. అనంతరం ఏదైతే బలం అనుకున్నామో అదే బలహీనతగా మారింది. అది పెంచిన జనాభానే వాటికి శాపంగా పరిణమించింది. గతంలో వాటి నాశనానికి కారణమైన ఇన్ బ్రీడింగ్ మళ్లీ మొదలైంది. ఎం 93 స్వయంగా తన పిల్ల తోడేలుతో సంతానాన్ని పొందటంతో ఆ గుంపులో జన్యు సమస్యలు మొదలయ్యాయి. అది చనిపోయిన రెండు సంవత్సరాలకి 2008లో వాటి సంఖ్య 60 శాతం తగ్గిపోయింది. 2015 నాటికి పరిస్థితి మరింత దుర్భరంగా మారి కేవలం రెండు తోడేళ్లు మాత్రమే మిగిలాయి.
అయితే పర్యావరణ శాస్త్రవేత్తలు 2018 నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 30 కి చేరింది. ప్రస్తుతం ఇక్కడ 1000 దుప్పులు ఉండటంతో.. తోడేళ్ల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నివేదికపై ఎకాలజీ ప్రొఫెసర్ విలియం రిపేల్ వివరణ ఇచ్చారు. ఇన్‌బ్రీడింగ్ అనేది అడవి జంతువుల పట్ల ప్రతికూలంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జంతువుల్లో జన్యు వైవిధ్యం అనేది పర్యావరణ జీవ వైవిధ్యానికి ఏ విధంగా తోడ్పడుతుందో ఈ నివేదిక రుజువు చేసిందని వివరించారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram