విధాత: ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా విశాఖలో నైట్ హాల్ట్ ఉంటున్నారు. గతంలో పాదయాత్ర.. ఓదార్పు యాత్రలు చేసినప్పుడు జగన్ కార్యకర్తల ఇళ్లలో, తోటలో బస చేసే వారు కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడూ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ మినహా వేరే చోట ఎక్కడా రాత్రికి బస చేయలేదు. జిల్లాల పర్యటనలకు వెళ్లినా సాయంత్రానికి తాడేపల్లి వెళ్లిపోతుంటారు.
కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పర్యటన పుణ్యాన జగన్ తొలిసారి విశాఖలో రాత్రి బస చేస్తున్నారు. దీన్ని అధికారులు.. కార్యకర్తలు విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు వైఎస్సార్ వంటివారు గతంలో జిల్లాలకు వెళితే అవసరం అయితే రాత్రికి అక్కడే ప్రభుత్వ గెస్ట్‌హౌజ్ లోనో, కార్యకర్తల ఇళ్లలోనో ఉండ పార్టీ , ఇటు ప్రభుత్వ వ్యవహారాలను కూడా చక్కబెట్టుకుని వెళ్ళేవారు.
విశాఖలో హుదూద్ సమయంలో చంద్రబాబు అయితే ఏకంగా వారం రోజుల పాటు విశాఖలోనే బస చేసి మొత్తం అంతా ఒక కొలిక్కి వచ్చాక కానీ అమరావతి వెళ్లలేదు. ఇక జగన్ టైం లో కూడా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో పదిమంది మరణించాక జగన్ హుటాహుటిన వచ్చి బాధితులను ఓదార్చి , సాయం ప్రకటించి వెళ్లారు తప్ప రాత్రికి విశాఖలో ఉండలేదు.
అయితే ఇప్పుడు మాత్రం తొలిసారి జగన్ మాత్రం విశాఖలో ఒక రోజు రాత్రి గడపబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో రెండు రోజుల టూర్ నిమిత్తం ఈ నెల 11న రాత్రికి విశాఖ వస్తున్నారు. దాంతో ఆయనకు స్వాగతం పలకడానికి జగన్ తాడేపల్లి నుంచి ఆ రోజు సాయంత్రం విశాఖ వస్తున్నారు. రాత్రికి మోడీ కూడా తూర్పు నావికాదళం అతిధి గృహంలో బస చేయనున్నారు.
అలాగే జగన్ కూడా విశాఖ పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. ఆ విధంగా నైట్ హాల్ట్ జగన్ విశాఖలో చేయనున్నారు. సీఎం గా జగన్ ఈ విధంగా విశాఖలో నైట్ హాల్ట్ చేయడం ఇదే మొదటిసారి. త్వరలో విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెడతామని అంటున్నారు. అయినా జగన్ ఏనాడూ ఇక్కడ రాత్రి బస చేయలేదు. గతంలో ఏ ప్రధాని కూడా విశాఖలో నైట్ హాల్ట్ చేయలేదు కానీ మోడీ మాత్రం తొలిసారిగా ఇక్కడ ఉంటున్నారు. మరునాడు అంటే 12న జగన్.. మోడీ ఇద్దరూ ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు