Jitender Reddy | విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఈ పాలన అంతమొందించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కంకణం కట్టుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిలునిచ్చారు. శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వెళుతున్న ఆయనను మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అక్కడే విలేకరులతో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులు, దళిత బంధు, బీసీ బంధు అనేక రకాల సమస్యల పైన ప్రశ్నించేందుకు ధర్నా కార్యక్ర మానికి వెళుతుంటే అరెస్ట్ చేయడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేత ధోరణి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు.
అధికార పార్టీ అవినీతి అక్రమాలను ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నదని, తన దొంగల ముఠాలోని సభ్యులకు మళ్లీ ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టే కార్యక్రమం మొదలుపెట్టారని విమర్శించారు. కేసీఆర్ చేసే అక్రమాలకు అవినీతికి వత్తాసు పలికే వారిని రానున్న రోజుల్లో ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని అన్నారు.
ప్రజలు నీతివంతమైన పాలనను కోరుకుంటున్నారని, రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణ వర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంజయ్య, కౌన్సిలర్ రామాంజనేయులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి కృష్ణవేణి, లక్ష్మీదేవి, యాదమ్మ తదితరులు ఉన్నారు.