కాశీ విశ్వనాథ్ ధామ్..రెండేండ్లలో 13 కోట్ల మంది భక్తులు

- రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు
- వీరిలో 16 వేల మంది విదేశీయులు
విధాత: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని చారిత్రక పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ్ ధామ్‌ను రికార్డుస్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. రెండేండ్లలో 13 కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్నిసందర్శించారు. వీరిలో 16 వేల మంది విదేశీ భక్తులు కూడా ఉన్నారు. సరిగ్గా రెండేండ్ల క్రితం చారిత్రక కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి పరిచారు. భారీ స్థాయిలో పునరుద్ధరించారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. దాంతో నాటి నుంచి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గతంలో పోలిస్తే భక్తుల సేవలు రెట్టింపు అయ్యాయి.
2021 డిసెంబర్ 13 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు రికార్డు స్థాయిలో 12 కోట్ల 92 లక్షల 24 వేల మంది సందర్శించుకున్నట్టు కాశీ విశ్వనాథ్ ధామ్, స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ వర్మఆదివారం మీడియాకు చెప్పారు. వీరిలో 15,930 మంది విదేశీ భక్తులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో భక్తుల బుకింగ్‌లు దాదాపు రెండింతలు పెరిగాయని వెల్లడించారు. భక్తుల సందర్శనతో మతపరమైన పర్యాటకం రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు ఆయన వివరించారు.