చేంజ్ రావాలంటే చంద్రశేఖర రావు పోవాలి: రేవంత్ రెడ్డి
గద్దె దించేందుకు సిద్ధం కావాలని పిలుపు ఎవరికి సంక్షేమం..? ఎక్కడ సంక్షేమం..? ఎనిమిదేళ్లలో రూ.25లక్షల కోట్ల అవినీతి తెలంగాణను KCR బొందల గడ్డ చేశారని ఆరోపణ కార్నర్ మీటింగ్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చేంజ్ రావాలంటే… రాష్ట్రంలో చంద్రశేఖర రావు పోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా స్పందిస్తే రాష్ట్రం బాగుపడుతుందని హితవు పలికారు. నిఖార్సుగా కొట్లాడితే ఇదంతా పెద్ద విషయమేమీ కాదని, రేవంత్ రెడ్డి […]

- గద్దె దించేందుకు సిద్ధం కావాలని పిలుపు
- ఎవరికి సంక్షేమం..? ఎక్కడ సంక్షేమం..?
- ఎనిమిదేళ్లలో రూ.25లక్షల కోట్ల అవినీతి
- తెలంగాణను KCR బొందల గడ్డ చేశారని ఆరోపణ
- కార్నర్ మీటింగ్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చేంజ్ రావాలంటే… రాష్ట్రంలో చంద్రశేఖర రావు పోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా స్పందిస్తే రాష్ట్రం బాగుపడుతుందని హితవు పలికారు. నిఖార్సుగా కొట్లాడితే ఇదంతా పెద్ద విషయమేమీ కాదని, రేవంత్ రెడ్డి ప్రజలకు ధైర్యాన్నిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మేడారం నుంచి ప్రారంభమై వస్రా సెంటర్‌కు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగులో రేవంత్ తొలి ప్రసంగం చేశారు. ఈ సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ నేత మధుయాష్కి గౌడ్, మాజీ మంత్రి బలరాం నాయక్, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. స్థానిక ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు తరాల త్యాగపోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నేత రాహుల్ గాంధీ అంటూ అభివర్ణించారు. దేశంలో బిజెపి సృష్టించిన విభజన వాదానికి చరమగీతం పాడాలని పిలుపునిస్తూ రాహుల్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 146 రోజులు 4000 కిలోమీటర్లు జోడో యాత్ర నిర్వహించారని చెప్పారు. కాశ్మీర్లో ప్రజా ఐక్యత జెండాను ఎగిరేసి… దేశానికి పటిష్ట నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గుండెగుండెకు జోడో సందేశం
జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి గుండె గుండెకు చేరవేసేందుకు హాత్ సే హాత్ జోడో యాత్రను రాష్ట్రంలో చేపట్టినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. మేడారం రాచరికానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డగా గుర్తు చేశారు. సమ్మక్క సారక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు మా ఇంటి ఆడపడుచు నియోజకవర్గం ములుగు జిల్లా మేడారం నుంచి యాత్ర ప్రారంభించామని చెప్పారు.
ఇది పోరాటాల గడ్డ
నిజాం రాచరికానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి, బలిదానాలు చేసిన చరిత్ర మనకు ఉందని అన్నారు. ఆ పోరాట వారసత్వంలో భాగంగానే 1200 మంది దళిత, గిరిజన బిడ్డల త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చిందనే విషయాన్ని అప్పుడే మర్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్ఫూర్తిని కాలరాచేందుకు… త్యాగాలను కప్పేసేందుకు కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తుందని విమర్శించారు. అన్యాయం పైన రోకలిబండలెత్తిన ఈ ప్రాంత చరిత్రను మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పథకాలకు తిలోదకాలు
సంక్షేమం అంటూ పొరుగు రాష్ట్రాల్లో ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగం, వైద్యం తదితర సమస్యలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో అమలైన పథకాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 5000 కోట్లు ఎగదొబ్బి పేద పిల్లల విద్యతో చెలగాటమాడారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో గూడేలకు ఉపాధ్యాయులను నియమిస్తే… రాష్ట్రంలో 6000 పాఠశాలను మూసివేసిన ఘనత ఈ కేసీఆర్ కు దక్కుతుందని కడిగేశారు.
ఎక్కడ సంక్షేమం? ఎవరికి సంక్షేమం..?
ఏది సంక్షేమం ఎక్కడ ఉందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రూ.25 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని ఒక్కో నియోజకవర్గానికి 20 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. కానీ ఎక్కడ అభివృద్ధి ఉందంటూ నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తే కేసీఆర్ చెప్పిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు జాడ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, నిరుద్యోగులకు రూ. 3000 భృతి అమలయ్యాయా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ నిజాలు ‘కావా …కావా’ అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.
రూ. 25 లక్షల కోట్ల బడ్జెట్ రాబందులు దోచుకు తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10% గద్దలు బాగుపడితే 90 శాతం పేదలు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ బొందల గడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం అవునా కాదా… అంటూ పదే పదే ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.
మార్పు రావాలా వద్దా అంటూ ప్రశ్నిస్తూ ఆ మార్పు కోసమే పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్పు అంటే చేంజ్ కావాలని… చేంజ్ వస్తే చంద్రశేఖర్ రావు పోతారని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కావాలన్నా, రుణమాఫీ జరగాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, చంద్రశేఖర్ రావు పోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ఆఫ్‌కో, ఫుల్లుకో, వెయ్యి నోటుకో అమ్ముడుపోతే ఇవి సాధ్యం కాదని… నికార్సుగా కొట్లాడితేనే చంద్రశేఖర రావును గద్దె దింపగలుగుతామనన్నారు. గద్దె దించేందుకు ప్రతి ఒక్కరు చేయెత్తి ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మధుయాష్కి, సీతక్క తదితరులు ప్రసంగించారు.
కేసీఆర్‌ది కుటుంబ పాలనగా..
గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ కుటుంబం రూ.25లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ది కుటుంబ పాలనగా మారిందని మండిపడ్డారు. కేసీఆర్ శ్రీరాంసాగర్ జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాకుండా మహారాష్ట్ర ప్రజలు వాడుకోవచ్చునని నాందేడ్ సభలో అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలువుతున్న పథకాల్లో అంతా అవినీతి చోటు చేసుకుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకంటే మంచి పథకాలను తీసుకువస్తామన్నారు.
నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సీతక్క కరోనా సమయంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో సీతక్క, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్, రాష్ట్ర నేతలు షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, రాజయ్య, తదితర నేతలు పాల్గొన్నారు. రోడ్‌షో అనంతరం గోవిందరావుపేట మండల కేంద్రానికి చేరుకొని కమ్మ సంఘం నాయకులతో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు.