Kiran Kumar Reddy |
విధాత: ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో జరిగిన నష్టం కంటే వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లా పునర్విభజనతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన బీజేపీ మహా సంపర్క్ అభియాన్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారందని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు గడిచాయి రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియదు. ఒకాయన రాజధాని అక్కడ అంటే ఇంకొకాయన మూడు రాజధానులు అంటూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ విడిపోతే చీకటి అవుతుందని ఎద్దేవా చేశారు. మీ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వమూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన నల్లారి వారు చాలాకాలం రాజకీయాలు దూరంగా ఉండి ఇటీవలే బీజేపీలో చేరారు. విభజన వల్ల ఏపీకి జరిగే నష్టాన్ని పూడ్చడానికి నాటి యూపీఏ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది.
పరిశ్రమలకు రాయితీలు ప్రకటించింది. రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. తొమ్మిదేళ్లుగా రాజధాని ఏది అని ప్రశ్నిస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డి దానికి గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలనే నిందించేకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ బాధ్యతను కూడా గుర్తు చేసి ఉంటే బాగుండేది.
రాజధాని నిర్మాణం అన్నది ఏపీ ప్రజల ఆకాంక్ష. రాజకీయాలకు అతీతంగా వారంతా తమ కంటూ ఓ రాజధాని ఉండాలని, ఇదీ మా రాజధాని అని చెప్పుకోవాలనేది వారి కోరిక. ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు మారుతున్నారు కానీ తొమ్మిదేళ్లుగా వారి ఆశలు నెరవేరలేదు. ఏపీలో బీజేపీ బలం ఎంతో కొత్తగా చెప్పేది ఏమీ లేదు.
కానీ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఆ పార్టీని రాజకీయంగా ఏపీలో బలోపేతం చేయడానికి రాజధాని అంశాన్ని ముందుకు తెచ్చినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం, ఏపీ ప్రజల రాజధాని ఆకాంక్ష కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలి. బీజేపీ నేతలు కూడా విభజన హామీలు అమలయ్యేలా కేంద్రాన్ని ఒప్పించాలి.