Kodela ShivaRam
విధాత: మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం టిడిపి అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరాంను పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి మొన్న పార్టీలో చేరిన కాపు నేత కన్నా లక్ష్మి నారాయణకు ఇన్‌చార్జీ పదవి ఇవ్వడంతో శివరాం శివాలెత్తి పోయారు.
ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. ఆయన కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా అని నేరుగా చంద్రబాబును ప్రశ్నించారు. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి.
ముప్పయ్యేళ్లపాటు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరాం కూల్చేశారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు.. సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరిదగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్ ను పోలింగ్ రోజున ఇనుమెట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్థితి ఎదురైంది.
నమ్ముకున్న కార్యకర్తల కోసం మొండిగా నిలబడే నిబద్ధతగల నాయకుడు యువనేత డాక్టర్ కోడెల శివరాం వెంటే మేమంతా ఉంటాం.. అంటూ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు మరోసారి రుజువు చేశారు. pic.twitter.com/AoKDvPu4p5
— Dr Kodela Sivaram (@KodelaDr) June 1, 2023
ఇక ఆ తరువాత టిడిపి ప్రభుత్వం ఓడిపోగా ఏటి శివరాం మీద ఫిర్యాదులు, కేసులు వెల్లువెత్తాయి. అవమానం భరించలేక కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు ఆయనకు చంద్రబాబు ఎపాయింట్ మెంట్ సైతం ఇవ్వలేదు. కానీ ఆ తరువాత సభలో చంద్రబాబు తాను శివరాం కెరీర్ గురించి చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు సత్తెనపల్లి బాధ్యతలు, టికెట్ సైతం కన్నా లక్ష్మి నారాయణకు ఇచ్చారు. దీంతో శివరాం రగిలిపోతున్నారు.
మా కుటుంబాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారు – కోడెల కుటుంబాన్ని పక్కన పెట్టడం సమంజసమేనా? – సత్తెనపల్లి నుంచి గెలిచి మా నాన్న రుణం తీర్చుకుంటా – పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తులను టీడీపీలోకి ఎలా తీసుకుంటారు? పార్టీలు మారిన కన్నాకు ఇచ్చిన గౌరవం… మా కుటుంబంపై ఎందుకు లేదు? చంద్రబాబు ఆస్తులపై కేసులు వేసిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఆయన్ను ఎలా పార్టీలో తీసుకున్నారు.. అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి టిడిపి అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.