Ramagundam | ఎమ్మెల్యే ‘కోరుకంటి’కి KTR షాక్‌.. టికెట్‌పై నీలినీడలు

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం (Ramagundam) నియోజకవర్గంలో ఓవైపు మండుతున్న ఎండలతోపాటు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఈ నియోజకవర్గ ఓటర్ల నాడి ఓ పట్టాన ఎవరికి అంతుపట్టదు. గత శాసనసభ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించిన కోరుకంటి చందర్ ఆ తర్వాత అధికార పార్టీ పంచన చేరి, ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే రెండో మారు గెలుపొందాలనే ఆయన ఆశలు […]

  • Publish Date - May 19, 2023 / 10:06 AM IST

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం (Ramagundam) నియోజకవర్గంలో ఓవైపు మండుతున్న ఎండలతోపాటు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఈ నియోజకవర్గ ఓటర్ల నాడి ఓ పట్టాన ఎవరికి అంతుపట్టదు. గత శాసనసభ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించిన కోరుకంటి చందర్ ఆ తర్వాత అధికార పార్టీ పంచన చేరి, ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

అయితే రెండో మారు గెలుపొందాలనే ఆయన ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. శాసనసభ్యునిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆయనకే బీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తుందో లేదోనన్న సందిగ్ధత నెలకొంది. ఇటీవల రామగుండంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు మిగిలిన శాసనసభ నియోజకవర్గాల పర్యటనలకు భిన్నంగా ఇక్కడ ‘కోరుకంటి’ టికెట్ ప్రస్తావనే తీసుకురాలేదు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయింపు డౌటే అన్న ప్రచారం పారిశ్రామిక ప్రాంతంలో జోరుగా సాగుతోంది. అధికార పార్టీ టికెట్ సంగతి అటు ఉంచితే శాసనసభ్యులుగా కోరుకంటి చందర్ ప్రతిష్ట నియోజకవర్గంలో మసక బారింది. రామగుండం ఎరువుల కర్మాగారం కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారగా, బాధితులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చాయి.

ఇదే విషయంలో మావోయిస్టు పార్టీ కూడా కోరుకంటి చందర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యే పని తీరు, అభివృద్ధిని బేరీజు వేసుకుంటే, సింగరేణి, ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కో, కేశోరాం లాంటి అనేక పరిశ్రమలకు ఆలవాలంగా, కార్మిక క్షేత్రంగా ఉన్న రామగుండంలో అధికార బీఆర్ఎస్
ఈసారి ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

కేటీఆర్‌పై సోషల్ వార్

మంత్రి కేటీఆర్ ఈనెల 8న రామగుండంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘సింగరేణి, ఎన్టీపీసీ నిధులు కాకుండా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వపరంగా విడుదల చేసిన నిధులెన్ని? చేసిన ఖర్చెంత?
శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తలాపున గోదావరి ఉన్నా.. తాగడానికి కాదు.. కాటికి కూతవేటు దూరాన్ని చూపిస్తోందంటూ.. సెటైర్లు విసిరారు.

జైపూర్ పవర్ ప్లాంట్, రామగుండం ఎరువుల కర్మాగారం, మెడికల్ కళాశాలల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 95% ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ స్కీం కింద ఎన్ని కుటుంబాలకు గృహప్రవేశం చేయించారో చెప్పాలని నిలదీశారు. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో ఆటోనగర్ ఊసేదని ప్రశ్నించారు.

రామగుండంలో పర్యాటక అభివృద్ధి దేవుడెరుగు.. ఇక్కడి ప్రజలు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేదని.. వారి బాధలు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ప్రభుత్వం నుండి నయా పైసా కేటాయించకుండా సింగరేణి సమకూర్చిన 500 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రారంభించే హక్కు మీకు ఎక్కడిది అంటూ కేటీఆర్‌కు సూటి ప్రశ్న వేశారు.

రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా స్థానిక శాసనసభ్యుని అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తూ,
ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్న కేటీఆర్ రామగుండంలో అందుకు భిన్నంగా ఆ ప్రస్తావనే తీసుకురాలేకపోయారు.

దీనిపైన సామాజిక మాధ్యమాలలో సెటైర్లు వెల్లువెత్తాయి. ‘ కేటీఆర్ గారు మా రామగుండం పాల ప్యాకెట్ల బ్యాచ్ మనోభావాలు మీరు తీవ్రంగా దెబ్బతీశారు’ ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు ప్రకటిస్తారని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ.. 100 లీటర్ల పాల ప్యాకెట్లు సిద్ధం చేసుకున్నారు.. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ.. అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.

పార్టీల కన్నా ఒంటరి పోరే మేలా?

రామగుండం నియోజకవర్గంలో ప్రాంతీయ, జాతీయ పార్టీల తరఫున పోటీ చేయడం కంటే స్వతంత్రులుగా పోటీ చేయడమే ఉత్తమం అనే నిశ్చితాభిప్రాయానికి ఇక్కడి రాజకీయ నాయకులు విచ్చేశారు. పార్టీలపై ఉన్న అసమ్మతి, అసంతృప్తి తద్వారా అధిగమించవచ్చన్నది వారి ఆలోచన. ఈ లెక్కన చూస్తే రామగుండం ఓటర్లు మరో మారు స్వతంత్ర అభ్యర్థికే పట్టంకట్టే అవకాశం ఉంది.

2009 నుండి అదే వరుస

2009 శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ 2000 పైచిలుకు ఓట్ల తేడాతో ప్రజారాజ్యం అభ్యర్థి కౌశిక్ హరిపై విజయం సాధించారు. 2014లో సత్యనారాయణ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై 2000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2018లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకంటి చందర్ 30 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు సత్యనారాయణ పై గెలుపొందారు.

సోమారపు దారెటు?

రామగుండం శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు గెలుపొందిన సోమారపు సత్యనారాయణ బీఆర్ఎస్ అధిష్టానంతో విభేదించి, ఆర్టీసీ చైర్మన్ పదవితో పాటు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. తదనంతరం బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ పెద్దపెల్లి జిల్లా శాఖ అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీలోని పరిస్థితుల కారణంగా కొద్ది కాలానికే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ, అదే పార్టీ టికెట్ పై ఆయన పోటీ చేయడం ఖాయమని చెప్పలేకపోతున్నారు.

ఒక జాతీయ పార్టీ నేత ఆ పార్టీని విడబోతున్నారంటూ పారిశ్రామిక ప్రాంతంలో ప్రచారం సాగుతున్నా
దానిపై ఆయన స్పందన లేదు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఫలితాల తీరు ఎలా ఉండబోతుందో అంచనాకు రాలేని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఉత్తమమని సోమారపు భావిస్తున్నారని సమాచారం.

కలిసొస్తున్న సింహం గుర్తు

రామగుండం నియోజకవర్గానికి సింహం గుర్తుకు తెలియని అభినాభావ సంబంధం ఏదో ఏర్పడింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ఈ చిహ్నం కోసం ఇక్కడ పోటీ ఏర్పడింది. ఏఐఎఫ్బీ పార్టీకి రామగుండం నియోజకవర్గంలో లీడర్, కేడర్ లేనప్పటికీ ఆ పార్టీ సింబల్ సింహం గుర్తుకు ఇక్కడ గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. 2014లో ఇదే గుర్తుపై శాసనసభకు పోటీ చేసిన కోరుకంటి చందర్ 35 వేల ఓట్లు సాధించారు. 2018లో ఇదే గుర్తుపై పోటీ చేసిన ఆయన శాసనసభలో అడుగు పెట్టారు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను సింహం గుర్తు ప్రధాన పాత్ర పోషించింది. ప్రధాన పార్టీల తరఫున టికెట్లు రాని నేతలు సింహం గుర్తును ఆశ్రయించారు. ఏకంగా తొమ్మిది మంది కార్పొరేటర్లు ఆ గుర్తుపై గెలుపొంది సంచలనం సృష్టించారు. టికెట్ రాకపోయినా సింహం గుర్తు ఉందని ఒకరు,
టికెట్ వచ్చినా సింహం గుర్తుపై పోటీ చేయాలని మరొకరు… తాజా, మాజీ ఎమ్మెల్యేలు తలపోస్తుండడం కోసం మెరుపు.

Latest News