KU వ్యవహారం పోలీసుల మెడకు.. దాడులపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు

KU సీపీ రంగనాథ్ తీరుపై తీవ్ర విమర్శలు వీసీకి వత్తాసు పలకడంపై విద్యార్థి జాక్ ఆగ్రహం ఆందోళన ఉధృతం చేసేందుకు నిర్ణయం 12న వరంగల్ బంద్ కు పిలుపు దాడిని చట్టబద్ధంగా తేల్చుకుంటాం : ఎమ్మెల్యే రఘునందన్ రావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం రచ్చకెక్కుతోంది. విద్యార్థుల నిరసనను భగ్నం చేయడంలో పోలీసుల తీరు తెరపైకి వచ్చింది. నిరసన తెలియజేసిన విద్యార్థులను తీవ్ర చిత్రహింసలకు గురిచేయడం పోలీసుల మెడకు చుట్టుకుంటుందా? […]

  • By: krs    latest    Sep 08, 2023 2:49 PM IST
KU వ్యవహారం పోలీసుల మెడకు.. దాడులపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు

KU

  • సీపీ రంగనాథ్ తీరుపై తీవ్ర విమర్శలు
  • వీసీకి వత్తాసు పలకడంపై విద్యార్థి జాక్ ఆగ్రహం
  • ఆందోళన ఉధృతం చేసేందుకు నిర్ణయం
  • 12న వరంగల్ బంద్ కు పిలుపు
  • దాడిని చట్టబద్ధంగా తేల్చుకుంటాం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం రచ్చకెక్కుతోంది. విద్యార్థుల నిరసనను భగ్నం చేయడంలో పోలీసుల తీరు తెరపైకి వచ్చింది. నిరసన తెలియజేసిన విద్యార్థులను తీవ్ర చిత్రహింసలకు గురిచేయడం పోలీసుల మెడకు చుట్టుకుంటుందా? సీపీ రంగనాథ్ తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. వర్సిటీ వీసీ రవిందర్ కు సీపీ వత్తాసు పలుకుతున్నారని ఈ వ్యవహారం పై కేయూ విద్యార్థి జాక్ భగ్గుమంటోంది. వీసీ, రిజిస్టార్ అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన తీవ్రం చేస్తున్నారు. కేయూ సీఐ, ఎస్ఐ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే అన్ని విద్యార్థి సంఘాల భాగస్వామ్యంతో ఏర్పడిన జాక్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహిం చారు. దీనికి తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్లు మద్ధతు తెలియజేశారు. శుక్రవారం దిష్టిబొమ్మల దహనం చేశారు. చట్టాన్ని పోలీసుల చేతులోకి తీసుకోవడాన్ని చట్టపరంగా తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులపై జరిగిన దాడిని కోర్టుకు, మానహక్కుల వేదికకు ఫిర్యాదు చేస్తామంటూ విద్యార్థులకు మద్ధతు తెలియజేసేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. ఈ మేరకు 12వ తేదీన వరంగల్ బంద్ కు సంపూర్ణంగా సహకరించాలని విన్నవించారు.

లై డిటెక్టర్ పరీక్షకు సీపీ సిద్ధమా: ఎమ్మెల్యే రఘునందనరావు

వర్సిటీ విద్యార్థులపై జరిగిన దాడికి తమకు సంబంధం లేదని చెబుతున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ చేశారు. ఈ సందర్భంగా గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

విద్యార్థులపై జరిగిన దాడిని కోర్టుకు ఫిర్యాదు చేస్తామని, మధ్యాహ్నం అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారని వివరించారు. కేసులు ఉన్న వీసీని పక్కనపెట్టుకుని మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు ఇవేమీ కొత్తకాదని స్పష్టం చేశారు. విద్యార్థులకు జిల్లా ప్రజలు అండగా నిలవాలని విన్నవించారు.

వీసీ, రిజిస్ట్రార్ ను భర్తరఫ్ చేయాలి: కేయూ జాక్

వర్సిటీ విద్యార్థులపైన దాడికి కారకులైన వీసీ,రిజిస్ట్రార్ ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం భర్తరఫ్ చేయాలని కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జాక్ నాయకులు మీడియాతో మాట్లాడారు. పది ప్రశ్నలు సంధించారు. పీహెచ్ డీ కేటగిరీ -1లో డబ్బుల కోసం రూల్సు మార్పించారని విమర్శించారు. అడ్మిషన్లు జరపవద్దని హై కోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.

యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లతో సంబంధం లేకుండా ప్రశ్నలు పరీక్షా పత్రం తయారు చేయించి, తప్పుగా ముద్రించారని నిలదీశారు. విద్యార్థి నాయకులు మాట్లాడితే కేసులు పెట్టించి, ఇంటర్వ్యూ కమిటీలు వీసీకి అనుగుణంగా వేసుకున్నారని విమర్శించారు. కేయూ భూ కబ్జాదారుతో (పెండ్లి అశోక్ బాబు) కుమ్మక్కయ్యారని విమర్శించారు.

పల్లా రాజేశ్వర రెడ్డి సహకారంతో10 సంవత్సరాలు నిండకుండానే వీసీగా వచ్చారని, హైకోర్టులో కేసు ఉందన్నారు. జడ్జిమెంట్ వచ్చే లోపల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రిటైర్డు ప్రొఫెసర్లను అనుబంధ అధ్యాపకులుగా నియమించి కోటి రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

కోర్టు జడ్జిమెంట్లను అమలు చేయకుండా ధిక్కరించినందుకు వీసీ, రిజిస్ట్రార్ పై కేయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందన్నారు. కేసు వున్న వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకొని సీపీ ప్రెస్మీట్ పెట్టీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి వీసీ, రిజిస్ట్రార్ ని బర్తరఫ్ చేయాలని, లేకుంటే ఉద్యమం తీవ్రంచేస్తాం అని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మేడ రంజిత్ కుమార్, గుగులోత్ రాజు నాయక్, డాక్టర్ మంద వీరస్వామి, కన్నం సునీల్, బీ నరసింహారావు, నిమ్మల రాజేష్, సోల్తీ కిరణ్ గౌడ్, పాషా మనోహర్, రాకేష్ క్రిష్ణన్, రంజిత్, వేణు రాజ్ పరుశురాం, విక్రమ్, రమేష్, నరేష్, మధు, దాడికి గురి అయిన విద్యార్థులు మాచర్ల రాంబాబు, అరెగంటి నాగరాజు, అంకిల్ల శంకర్, మట్టెడ కుమార్ పాల్గొన్నారు.