విధాత: భూసేకరణలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భూ బాధితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు. భట్టి తమ గ్రామానికి వచ్చారని తెలుసుకున్న భూ బాధితులు ఆయనను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. భూసేకరణలో పట్టాదారులకు నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు మాత్రమే రికార్డుల్లో చూపించి సగం భూమికీ మాత్రమే పరిహారం ఇచ్చారని బాధితులు గోడు వెల్లబోసుకున్నారు.
గత బిఆరెస్ ప్రభుత్వం ఎంజాయ్ మెంట్ సర్వే తో అసలైన లబ్ధిదారులకు పరిహారం ఇవ్వకుండా బోగస్ లబ్ధిదారులకు పరిహారం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగ లో తొక్కి ప్రత్యేక జీవో ద్వారా ఎకరానికి తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్లో పరిశ్రమలు స్థాపించిన యజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిపారు.
గత ప్రభుత్వంలో మంత్రుల పర్యటన సందర్భంగా భూ బాధితులను కలవకుండా పోలీస్ స్టేషన్ లో నిర్భందించే వారని, ఇప్పుడు మాకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు భూ బాధితులు చేతులెత్తి దండం పెట్టారు. చందన వెళ్లి భూభాధితులకు సహేతుకంగా శాస్త్రీయంగా నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ భీమ్ భరత్ డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. చందనవెల్లి గ్రామానికి పక్కన ఉన్న సీతారాంపూర్ లో 1148 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నదని, అక్కడ భూ బాధితులకు ఎకరానికి రూ.21 లక్షలు,121 చదరపు గజాల స్థలం పరిహారంగా ఇచ్చారని చంద్రవెల్లిలో కూడా ఇదే అమలు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు.