విధాత: ప్రేమ పేరుతో ఒకరిని తల్లిని చేసి మరొకరితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడి మోసం వెలుగు చూసింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన లింగాల సాయి కుమార్ మూడేళ్లుగా తన సమీప బంధువు కూతురితో ప్రేమ వ్యవహారం నడిపి ఆమెను తల్లిని చేశాడు.
ఏడు నెలల క్రితం ఆమె పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కూడా బాధిత యువతి సాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెంచింది. పెళ్లికి నిరాకరిస్తూ వచ్చిన సాయి కుమార్ పై గతంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు కోర్టులో కొనసాగుతుంది.
ఇది ఇలా ఉండగానే 15 రోజుల క్రితం సాయి వేములపల్లి మండలానికి చెందిన మరో అమ్మాయితో వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి సాయి కుమార్ ఇంటి ఎదుట తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ధర్నాకు దిగింది.
ఆగ్రహించిన సాయికుమార్ కుటుంబ సభ్యులు బాధితురాలుపై, వారి వెంట ఉన్న మహిళా నాయకురాలు లపై కర్రలతో శనివారం దాడి చేశారు. ఈ ఘటనపై న్యాయం చేయాలంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.