విధాత: ఆంధ్రా రాజకీయాల్లో మళ్ళీ సందడి నెలకొంది. ఒకేసారి 18 ఎమ్మెల్సీ ఖాళీ అవడంతో జగన్ మరి పైరవీలకు తావు లేకుండా ఒకేసారి మొత్తం లిస్ట్ రిలీజ్ చేసేసారు. అందులో ఎక్కువమంది బీసీలు, ఇతర అట్టడుగు వర్గాలవారే ఉన్నారు. ఇదే తరుణంలో రాష్ట్ర కేబినెట్లోనూ మార్పులు ఉంటాయి అని అంటున్నారు. మొత్తం నాలుగైదుగురిని తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.
మిగతావారి సంగతి ఎలా ఉన్నా గానీ ఈసారి కమ్మ వారి నుంచి ఎవరికీ ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నయ్. వాస్తవానికి జగన్ అధికారంలోకి రాగానే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పౌరసరఫరాల మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే రెండున్నరేళ్ల తరువాత ఆయన్ను తొలగించాక ఇంకో కమ్మ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వలేదు.
అంటే ఇంట పెద్ద రాష్ట్రంలో ప్రభావితమైన కమ్మ సామజిక వర్గానికి మంత్రి పోస్ట్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో తెలుగుదేశం దళాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ ను కమ్మవారిని ద్వేషించే పార్టీగా ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడింది. తెలుగుదేశం అలాంటి ప్రచారాన్ని సాగిస్తోంది కూడా. దీంతో ఇప్పుడు మళ్ళీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడితే కమ్మల్లో ఎవరికీ ఛాన్స్ ఉంటుందా అని ఊహాగానాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీసీ, వెనుకబడిన కులాలకు ఇచ్చినట్టుగానే కమ్మ వర్గానికి కూడా ఒక మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. అయితే ఆ వర్గంనుంచి పదవి దక్కించుకునేది ఎవరనే ది తెలియడం లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల ప్రచార సమయంలోనే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని అప్పట్లోనే మాట ఇచ్చారు.
దీంతో ఆయన చిలకలూరిపేట నుంచి టికెట్ వదులుకుని విడుదల రజని విజయానికి కృషి చేశారు. దీంతో ఆమె కాస్తా మంత్రి అయ్యారు కానీ రాజశేఖర్ కు మాత్రం ఏమాత్రం గుర్తింపు లేకుండా పోయింది. ఇన్నాళ్లూ ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారు. తన మాట నిలబెట్టుకోవడం కోసం జగన్ ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారెమో అని అంటున్నారు.
అదే సమయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. అసలే తన నియోజకవర్గంలో మంత్రి జోగిరమేష్ తో పొసగక ఉక్కిరి బిక్కిరి అవుతున్న వసంత కృష్ణ ప్రసాద్ ఆమధ్య వైరాగ్యంలోకి వెళ్లిపోయారు.. ఏమి పాలిటిక్స్, ఏమి జీవితం అంటూ వైరాగ్య గీతాలు పాడారు. దీంతో ఆయన్ను జగన్ పిలిచి కాస్త బుజ్జగించడంతో మళ్లీ కాస్త యాక్టివ్ అయ్యరు. ఆయనకు జగన్ మంత్రి పదవి హామీ ఇచ్చారని, కమ్మకోటాలో భర్తీ చేస్తారని కూడా వినిపిస్తోంది.