Delhi Airport | విధాత: దిల్లీ (Delhi Airport) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఓ ఘటన అక్కడున్న భద్రతా లోపాన్ని (Security Breach) బయటపెట్టింది. శనివారం అర్ధరాత్రి ఒక వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించడమే కాకుండా రన్‌వే పైకి కూడా వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేస్తున్న ఓ పైలట్ రన్‌వేకు సమీపంలో ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని రక్షించారు. ఘటనలో విమానం సురక్షితంగా టాక్సీవేకు చేరుకుందని అధికారులు తెలిపారు.
‘ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయ్యాక ట్యాక్సీ గేట్‌కు వస్తున్నపుడు ఒక వ్యక్తి తమ ముందు రన్‌వేపై నడిచాడని ఆ పైలట్ సమాచారం ఇచ్చారు. ఏటీసీ వెంటనే ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఏఓసీసీ)కు సమాచారం ఇవ్వడంతో వారు సీఐఎస్ఎఫ్‌ను అలర్ట్ చేశారు’ అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాసేపటికి నిందితుణ్ని గుర్తించి అతణ్ని అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన అతణ్ని దిల్లీ పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడు ఎయిర్‌పోర్ట్ గోడ దూకి లోనికి ప్రవేశించినట్లు తెలిసిందని పోలీసు అధికారి తెలిపారు.
ఎయిర్‌పోర్టు భద్రత సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటుందని.. తమకు సంబంధం ఉండదని ఆయన అన్నారు. హైపర్‌సెన్సిటివ్ కేటగిరీ రిస్క్‌లో ఉన్న ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరగడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతుండటం.. వీవీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉన్న ఆ సమయంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా లోపాలను కళ్లకు కట్టినట్టు చూపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్‌ను తక్షణం సస్పెండ్ చేశారు.