Viral: డబుల్ ధమాకా.. ఒకేసారి ఇద్ద‌రిని పెళ్లి చేసుకున్న యువ‌కుడు! (Video)

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్న సామెత ఏమో గాని ఓ యువకుడు ఒకే పెళ్లితో ఇద్దరు పెళ్లాలను సంపాదించుకున్న తీరు మాత్రం వైరల్ గా మారింది. ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఆ యువకుడు.

  • By: Somu |    latest |    Published on : Mar 28, 2025 5:46 PM IST
Viral: డబుల్ ధమాకా.. ఒకేసారి ఇద్ద‌రిని పెళ్లి చేసుకున్న యువ‌కుడు! (Video)

Man Get Married Two Women AT A Time:

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్న సామెత ఏమో గాని ఓ యువకుడు ఒకే పెళ్లితో ఇద్దరు పెళ్లాలను సంపాదించుకున్న తీరు మాత్రం వైరల్ గా మారింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ వింత పెళ్లి ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే లింగాపూర్ మండలం గుమ్నూర్(కె) గ్రామానికి చెందిన సిడాం సూర్యదేవ్  కు  లాల్ దేవి, జలకర్ దేవి లకు  మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది. వారి మధ్య సాగుతున్న ముక్కోణపు ప్రేమకథ(ట్రయంగిల్ లవ్ స్టోరీ) ఘాటుగా మారిపోగా..పరస్పరం ఒకరు లేకుండా మరొకరు ఉండలేని స్థితికి చేరింది.

సూర్యదేవ్ ను ప్రేమించిన ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లు కాదు.. అలా అని స్నేహితులు కూడా కారు. వారిద్దరు వేర్వేరు గ్రామాలకు చెందిన వారు. తమ ముక్కోణ ప్రేమకథ విషయం తెలిశాక విడిపోవడం కంటే ముగ్గురు కలిసి జీవించాలని వారు నిర్ణయించుకున్నారు.  దీంతో సూర్యదేవ్ ఆ  యువతుల తల్లిదండ్రులకు అదే విషయం చెప్పి ఒప్పించాడు. చేసేదేమీ లేక వారి కుటుంబాల పెద్ధలు కూడా ఆ ముగ్గురి పెళ్లికి అంగీకరించారు.

ఇంకేముంది పెళ్లి ఆహ్వాన పత్రికలోనూ వరుడితో పాటు ఇద్దరు వధువుల పేర్లు ముద్రించి మరి బంధుమిత్రులను ఆహ్వానించారు. ఏకంగా సాంప్రదాయ వివాహ పద్ధతిలోనే ఒకే పెళ్లి మండపంలో వేద మంత్రాలు, భాజా భజంత్రీల మధ్య  సూర్యదేవ్ తన ఇద్దరు ప్రియురాళ్లయిన లాల్ దేవి, జలకర్ దేవిలకు చెరో మూడు ముళ్లు మొత్తం ఆరుముళ్లు వేసి మరి పెళ్లి చేసుకున్నాడు.

ఇద్దరి భామల ముద్దుల మొగుడుగా మారాడు. వారిద్దరిలో ఎవరికీ లోటు లేకుండా చూసుకుంటానని బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చాడు. ఆ యువకుడికి మూడు ఎకరాల పొలం ఉంది. వారిద్దరికీ చెరో సగం అంటే.. ఎకరంన్నర చొప్పున  రాసి ఇచ్చేశాడు. దీనికి పెద్దలు కూడా అంగీకరించారు. ఇప్పుడి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన కొందరు నెటిజన్లు ఈ రోజుల్లో ఒక్క పెళ్లం దొరకడం కష్టమవుతుంటే మనోడు ఒకే పెళ్లితో ఇద్దరు పెళ్లాలను పొంది డబుల్ ధమాకా కొట్టాడని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నారి నారి నడుమ మురారి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం పెళ్లయిపోగానే సంబరం కాదు..ముందుముందు ఉంటది సూడు మనోడికి జోడు మద్దెల దరువు అంటూ సెటైర్లు వేస్తున్నారు.