Medigadda Barrage Case: మేడిగడ్డ కుంగుబాటు కేసు సీబీఐకీ..సర్కార్ యోచన

Medigadda Barrage Case: మేడిగడ్డ కుంగుబాటు కేసు సీబీఐకీ..సర్కార్ యోచన

Medigadda Barrage Case: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసును సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐకి అప్పగించే యోచనపై కసరత్తు చేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి పేల్చి ఉంటారంటూ తాజాతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరీయస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదంలో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కేసును సీబీఐకి అప్పగించాలన్న ఆలోచన చేస్తుంది. అయితే ఓ వైపు జస్టిస్ పీసీ. ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలపై విచారణ చేస్తున్న క్రమంలో ఈ కేసును సీబీఐకి అప్పగించవచ్చా లేదా అన్న అంశంపై న్యాయపరమైన సలహాలు ప్రభుత్వం తీసుకుంటుంది. న్యాయపరంగా సమస్యలు లేకపోతే మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది.

అప్పట్లో అవే అనుమానాలు
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా…అప్పట్లో మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ల లో దీనిపై కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ కుంగుబాటు వెనుకు కుట్ర కోణం అనుమానాలున్నాయని..విద్రోహ శక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ శబ్ధంతో బ్యారేజీ కుంగడంపై వారు అనుమానాలతో ఇరిగేష్ ఏఈఈ రవికాంత్ వ్యక్తం చేశారు. 2023ఆక్టోబర్ నెల 21న సాయంత్రం పెద్ద శబ్దంతో పిల్లర్ కుంగిపోయినట్టుగా నీటిపారుదల శాఖ ఏఈఈ రవికాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 19,20, 21 పిల్లర్లు కుంగిపోయినట్టుగా ఆ ఫిర్యాదులో రవికాంత్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం వెనుక విద్రోహశక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని కోరారు. పోలీసులు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

అప్పగిస్తే విచారణకు సిద్దమన్న సీబీఐ

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబాటుపై మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి అప్పగించాలని గతంలోనే పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నవంబర్ 1వ తేదీన ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 86 వేల కోట్లు సేకరించడంపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలని విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడం లేదన్న పిటిషన్ ఆరోపించారు. విచారణ సందర్బంగా సీబీఐ అధికారులను వివరణ కోరింది. అప్పట్లో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ తమకు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే, తమకు కావలసిన వనరులను సమకూరిస్తే తమకు దర్యాప్తు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా సీబీఐకి అప్పగించడంపై అయిష్టతతో జ్యూడీషియల్ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిటీని నియమించారు. తాజాగా కేటీఆర్ మరోసారి మేడిగడ్డ కుంగుబాటుపై బాంబులు పెట్టారన్న అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ విచారణకు అప్పగించి బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ కు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం.