Nambala Kesava Rao: నంబాల మృతదేహం అప్పగింతకు మంత్రి అచ్చెన్నాయుడు అడ్డు!

- పోలీసులు మమ్మల్ని బెదిరిస్తునే ఉన్నారు
- కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు
- చత్తీస్ గఢ్ లోనే అంత్యక్రియలు చేసుకోవాలంటున్నారు
- కోర్టు ధిక్కరణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- సోదరుడు ఢిల్లీశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు
Nambala Kesava Rao: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో ఇటీవల మరణించిన మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని నంబాల సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడి మృతదేహం విషయంలో అచ్చెన్నాయుడు తమను బెదిరించాడని నంబాల ఢిల్లీశ్వరరావు ఆరోపించారు. సోదరుడి ఎన్ కౌంటర్ సమాచారం టీవిలో చూశాక..శ్రీకాకుళం ఎస్పీ వద్ధకు వెళ్లి మృతదేహం అప్పగించే ప్రయత్నం చేయాలని కోరడం జరిగిందని వివరించారు. అందుకు ఆయన సహాయం చేస్తామంటూనే నంబాల మృతదేహం తీసుకరావడంలో పై అధికారులు, రాజకీయ పెద్దలు సానుకూలంగా స్పందించకపోవచ్చని..అందుకే మీరు చత్తీస్ గఢ్ అధికారులను సంప్రదించాలని చెప్పారని తెలిపారు. ఎవరూ సహాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పడంతో..అవసరం లేదని తానే ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడుతానని చెప్పి పంపించారని..అయితే ఆ తర్వాతా ఎస్పీ నుంచి స్పందన లేదన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టు నంబాల మృతదేహాన్ని అప్పగించాలన్న ఆదేశాలతో మా సోదరుడు నంబాల రాంప్రసాద్, మరో నలుగురితో కలిసి చత్తీస్ గఢ్ కు వెళ్లడటం జరిగిందన్నారు. పోలీసులు బెదిరించినప్పటికి వారు అక్కడకు వెళ్లారన్నారు. జగదేవ్ పూర్ పోలీసులు వారిని బెదిరించి వెంటనే ఆంధ్ర బార్డర్ కు వెళ్లాలని చెప్పడంతో అలాగే చేశారని వివరించారు. ఆ సమయంలో మా సోదరుడు రాంప్రసాద్ వెంట ఉన్న కజిన్ నంబాల రాజశేఖర్ తో అచ్చెన్నాయుడు ఫోన్ లో మాట్లాడి..మిమ్మల్ని ఛత్తీస్ గఢ్ ఎవరు వెళ్లమన్నారంటూ బెదిరించి వెంటనే వెనక్కి వచ్చేయాలని ఆదేశాంచాడని ఢిల్లీశ్వర్ రావు తెలిపారు. అక్కడికి వెళితే మీరు కూడా సమస్యలలో పడుతారని హెచ్చరించడంతో వారంతా భయపడిపోయి వెనక్కి వచ్చేశారన్నారు.
మళ్లీ కోర్టు ఆదేశాలతో మా కుటుంబ సభ్యులతో కలిసి మా సోదరుడు రాంప్రసాద్ విశాఖ పట్నం నుంచి అంబులెన్స్ తో నారాయణపూర్ కు వెళ్లారని తెలిపారు. పోలీసులు మీరు కేశవరావు కుటుంబ సభ్యులన్న నమ్మకం ఏమిటంటూ.. కుటుంబ సభ్యులతో కూడిన ఫోటో కావాలని అడిగారని వివరించారు. దీంతో 45సంవత్సరాల కింద మాకు దూరమైన వ్యక్తి ఫోటో ఎలా ఇవ్వగలమని మా సోదరుడు రాంప్రసాద్ చెప్పగా..పోలీసులు మృతదేహం అప్పగించలేదన్నారు. నిజానికి అచ్చెన్నాయుడు కుటుంబంతో..ముఖ్యంగా దివంగత ఎర్రన్నాయుడుతో నాకు మంచి పరిచయం ఉందని..అయితే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు మా సోదరుడి మృతదేహం అప్పగించకుండా అడ్డుపడుతు ఉండవచ్చని ఢిల్లీశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశించినా కూడా మృతదేహం అప్పగించకుండా రెండు రాష్ట్రాల అధికారులు, రాజకీయ నాయకులు సహకరించడం లేదని.. కోర్టు ధిక్కరణ కింద చత్తీస్ గఢ్ పోలీసులపై ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయిస్తామని వెల్లడించారు. చత్తీస్ గఢ్ లోనే అంత్యక్రియలు చేసుకుంటే మృతదేహం ఇస్తామన్నట్లుగా అక్కడి అధికారులు మాట్లాడుతున్నారన్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే ర్యాలీలు తీయడం..స్తూపాలు కట్టడం..తర్వాతా నివాళులర్పించడం వంటివి చేస్తారని..ఇదంతా మళ్లీ నక్సలిజం వైపు మరికొందరిని ఆకర్షించేదిగా ఉంటుందని..అందుకే మేం మృతదేహం ఇవ్వమని చత్తీస్ గఢ్ పోలీసులు మా సోదరుడు రాంప్రసాద్ తో చెప్పారని ఢిల్లీశ్వర్ రావు తెలిపారు. మా సోదరుడి మృతదేహం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తుందని..దయచేసి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. పోలీసులు మా కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతున్నారని..దాదాపుగా గృహనిర్భంధం పరిస్థితి నెలకొందని..మృతదేహం ఇస్తే వారి సమక్షంలోనే అంత్యక్రియలు జరిపిస్తామని ఢిల్లీశ్వర్ రావు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా భద్రతా బలగాలే అంత్యక్రియలు పూర్తి చేశాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇతర మావోయిస్టుల మృతదేహాలకు సైతం పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.