మంత్రి చాణక్యం.. కాంగ్రెస్‌ కంచుకోట టీఆర్‌ఎస్‌ వశం

విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమైన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పేరు మారుమోగుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో అన్నీ తానై మంత్రి టీఆర్‌ఎస్‌ను విజయ తీరాలకు చేర్చారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జగదీశ్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టారు. జిల్లాలో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేసుకునే ఉత్తమ్, జానారెడ్డి లాంటి వాళ్ళను ఉప ఎన్నికల్లో మట్టి కరిపించారు. […]

  • Publish Date - November 7, 2022 / 03:27 AM IST

విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమైన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పేరు మారుమోగుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో అన్నీ తానై మంత్రి టీఆర్‌ఎస్‌ను విజయ తీరాలకు చేర్చారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జగదీశ్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టారు. జిల్లాలో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేసుకునే ఉత్తమ్, జానారెడ్డి లాంటి వాళ్ళను ఉప ఎన్నికల్లో మట్టి కరిపించారు.

ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ శానం పూడి సైదిరెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి తన భుజ స్కంధాలపై వేసుకుని కాంగ్రెస్ సీటును టీఆర్‌ఎస్ ఖాతాలో వేశారు. నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల భగత్‌ను పార్టీ నిలబెడితే ఆ స్థానంలోనూ పార్టీని విజయపథంలో నడిపించారు.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషించి ప్రచారంలో ఆద్యంతం అన్ని తానై నడిపించి టీఆర్ఎస్‌ను గెలిపించారు. ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన బలమైన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో మంత్రి జగదీష్ రెడ్డి వేసిన వ్యూహాలు బీజేపీకి ఓటమి చవిచూపించాయి.

రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ఆయన స్వలాభంతో పార్టీ మారి ఉపఎన్నికకు కారణమయ్యాడని ఓటర్లను కన్విన్స్ చేయడంలో జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. ఇదే సందర్భంలో జగదీశ్ రెడ్డి అటు రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఘాటైన విమర్శలు చేసి మునుగోడులో తమ్ముడికి మద్దతు ఇవ్వకుండా, కాంగ్రెస్ కోసం ప్రచారానికి రాకుండా రాజకీయంగా ఇరకాటంలో పెట్టడంలో ఆయన సక్సెస్ కాగాలిగారు.

ఉప ఎన్నికల్లో జగదీష్ రెడ్డిని నిలువరించేందుకు బీజేపీ ఆయన పీఏతో పాటు సన్నిహితులపై ఐటీ దాడులు జరిపి భయ పెట్టినా, ఎన్నికల సంఘానికి తనపై ఫిర్యాదు చేసి 48 గంటల పాటు ప్రచారానికి దూరం చేసి అడ్డుకోగలిగినా.. ఎన్నికల్లో ఆయన వ్యూహాలను మాత్రం అడ్డుకోవడంలో విఫలమై టీఆర్ఎస్ గెలుపును మాత్రం బీజేపీ ఆపలేకపోయింది.

ఉప ఎన్నికల ప్రచార ప్రారంభ దశలో టీఆర్ఎస్‌ను వీడిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వంటి వారు తనపై విమర్శలు చేసినా.. ఉప ఎన్నికల్లో విజయంతో వాటిని జగదీశ్ రెడ్డి తిప్పి కొట్టినట్లైంది. పార్టీ గెలుపులో కమ్యూనిస్టులను సమన్వయం చేసుకుంటూ గులాబీ శ్రేణులను నడిపించడంలో జగదీశ్ రెడ్డి చూపిన చొరవ ప్రశంసనీయం.

2018 ఎన్నికల పిదప రాష్ట్రంలో జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన మూడు ఉప ఎన్నికల స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడులలో పార్టీ ఇంచార్జిగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా జగదీష్ రెడ్డి ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలను పార్టీకి అందించి పార్టీ శ్రేణులతో హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో మలుపుగా ప్రచారం పొందిన మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీకి గెలుపు అందించి టీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టడంతో పాటు ఇది ఉప ఎన్నికల సమయంలో పురుడు పోసుకున్న బీఅర్ఎస్‌కు కొత్త జవసత్వాలు అందించారు.

ఉప ఎన్నికలు టీఆర్ఎస్ విజయంతో ఒకప్పుడు కమ్యూనిస్టుల ఖిల్లాగా, అనంతరం కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాను ప్రస్తుతం 12కు 12 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేలా చేయడంలో జిల్లా మంత్రిగా జగదీశ్ రెడ్డి రాజకీయ చతురత చాటినట్లు అయింది. సీఎం కేసీఆర్ తన కుడి భుజంగా చెప్పుకునే మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీకి అందించిన విజయంతో మున్ముందు పార్టీలో మరింత గుర్తింపు పొందడం ఖాయమని చెప్పవచ్చు.