Minister Jagadish Reddy |
విధాత: శాంతిభద్రతలు పరిరక్షించడంలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ చేస్తున్న కృషి ఎంతో అమోఘమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రశంసించారు. సూర్యాపేటలో ఆదివారం సీఎం పర్యటనను విజయవంతం చేసిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర్ రావ్, డీఎస్పీ నాగ భూషణం, సీఐ రాజశేఖర్‌తో పాటు పోలీసు శాఖకు మంత్రి అభినందనలు తెలిపారు.
నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆధునిక టెక్నాలజీ తో కూడిన భవనాలను ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి, వారి మన్ననలు పొందాలని కోరారు. సీఎం పర్యటన విజయవంతమైన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన పోలీసు అధికారులను మంత్రి అభినందించారు.
సూర్యాపేట తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో పరుగెడుతూనే, అభివృద్ధిలో రాష్ట్రం లో ముందు వరుసలో ఉన్నామన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దేనికోసమైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పోలీస్ శాఖ అన్ని రంగాల్లో తమ సేవలను కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు.