Minister Jagadish Reddy |
విధాత: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డిపో అవరణలో విశ్రాంత ఉద్యోగుల కోసం నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్మికులను ఉద్యోగస్తులుగా మార్చిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. ప్రజల కష్ట నష్టాలు తెలిసిన కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి గత పాలకులుగా ఉన్న చంద్రబాబు యత్నాలను, ప్రపంచ బ్యాంక్ షరతులకు భయపడి నోరు మెదపని అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రయత్నాలను అడ్డుకుంది ఆనాటి రవాణా శాఖ మంత్రి కేసీఆర్ యే అన్నారు.
మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. ఎల్‌ఐసీనీ ఇప్పటికే ప్రైవేటు పరం చేసిన కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ రంగాన్ని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి చేసిన , చేస్తున్న ప్రయత్నాలకు బీఆరెస్ పూర్తి వ్యతిరేకమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత కేసీఆర్ తోనే ఆర్టీసి కార్మికుల ఆకాంక్షలు నెరవేరనున్నాయని మంత్రి పేర్కొన్నారు.
కాగా.. సీఎం కేసీఆర్ కు అవసరమైన సందర్బంలో అండగా కలిసి నడుద్దామని, ప్రతి ఫలాలు అనుభవిద్దాం అని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న అంతర్గత రహదారిని త్వరలోనే నిర్నిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.