Minister Jagadish Reddy | ప్రగతి పథంలో తెలంగాణ పరుగులు: మంత్రి జగదీశ్‌రెడ్డి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గుత్తా, సునీతలు Minister Jagadish Reddy | విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో దగా పడిన తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రగతి పథం దిశగా పరుగులు పెడుతుందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతకావిష్కరణ చేసి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సబ్బండ […]

- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గుత్తా, సునీతలు
Minister Jagadish Reddy | విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో దగా పడిన తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రగతి పథం దిశగా పరుగులు పెడుతుందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతకావిష్కరణ చేసి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. రైతులకు రుణమాఫీ, బీమా, రైతుబంధు, 24గంటల ఉచిత విద్యుత్తు అందుతుందన్నారు. దళితులకు దళిత బంధు, మైనార్టీ, బీసీ బంధు, గిరిజనులకు పోడు పట్టాలు, పేదలకు గృహలక్ష్మీ, ఆసరా పింఛన్లతో అందరి సంక్షేమంతో తెలంగాణ పురోగమిస్తుందన్నారు.
విద్యా, వైద్య, పారిశ్రామిక, పట్టణ, పంచాయతీ పాలనా రంగాల్లో తెలంగాణ ప్రగతి అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించిన సూర్యాపేట కలెక్టరేట్, మెడికల్ కళాశాల, సమీకృత మార్కెట్ సహా అనేక రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాలువలకు గోదావరి జలాలు, ఇంకోవైపు మూసీ జలాలు అందుతున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి కొరత తీరిపోయిందన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి జాతీయ పతాకావిష్కరణలు చేసి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర సాధనకు పోరాడిన అమరవీరులను స్మరించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో అన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. రైతులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, మహిళలు, విద్యార్ధి, యువత సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ(ఉదయ సముద్రం) ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి వసతి పెరిగిందన్నారు. మూసీ నీటి వసతి కూడా విస్తరించడం జరిగిందని, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరుసగా మూడు పంటలకు నీరందుతుందన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణాలు, అసుపత్రుల స్థాయి పెంపుతో వైద్య, విద్యారంగాల్లో గణనీయ ప్రగతి సాధ్యమైందన్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.