మోదీ పచ్చి అబద్ధాలకోరు: మంత్రి కేటీఆర్‌

  • Publish Date - October 4, 2023 / 06:03 AM IST
  • బీజేపీతో ఉంటే మంచి.. లేకుంటే చెడునా?
  • నేను సీఎం కావాలంటే మోదీ పర్మిషన్‌ ఎందుకు?
  • ఎన్డీయేలో చేరడానికి మాకు పిచ్చి కుక్క కరిచిందా?
  • మంచి స్టోరీ రైటర్‌గా మారిన ప్రధాని మోదీ
  • సినిమాలకు రాసుకుంటే ఆస్కర్‌ ఖాయం
  • వారసత్వాల గురించి ప్రధాని మాట్లాడటమా?
  • జేడీఎస్‌, పీడీఎఫ్‌, టీడీపీ, అకాలీ సంగతేంటి?
  • అవి వారసత్వ పార్టీలని అప్పుడు గుర్తురాలేదా?
  • నరేంద్ర మోదీతో బీఆరెస్‌ చివరిదాకా తలపడుతది
  • మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఎటాక్‌


విధాత: ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలకోరని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం బీఆరెస్‌ కార్యాలయంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై మోదీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. మోదీ చెప్పే అబద్ధాలను చిన్నపిల్లలు కూడా నమ్మరని అన్నారు. మోదీ అబద్దాలకు, పెడబొబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని అన్నారు.


మోదీ ఎంత గొంతు చించుకున్నా అబద్ధాలు నిజం కావన్నారు. మోదీ దగుల్బాజీ మాటలను దేశంలో ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. మోదీ ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి టూరిస్ట్‌లా వచ్చి అడ్డమైన చెత్త వాగి పోతారని మండిపడ్డారు. బీజేపీ జుమ్లా పార్టీ అని, వాట్సాప్‌ యూనివర్సిటీకి మోదీ వైస్‌ చాన్స్‌లర్‌ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మోడీ మంచి స్టోరీ రైటర్‌గా మారారని, మంచి కథలు చెబుతున్నారని, సినిమాలకు కథలు రాసుకుని, యాక్టింగ్‌ చేస్తే ఆయనకు ఆస్కార్‌ వస్తుందని దుయ్యబట్టారు.


‘నేను సీఎం కావడానికి కేసీఆర్‌.. మోదీ పర్మిషన్‌ అడిగినట్లుగా చెప్పారు. అసలు నేను సీఎం కావడానికి మోదీ పర్మిషన్‌ ఎందుకు? ఆయనేమన్నా మా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడా?’ అని ప్రశ్నించారు. తాను సీఎం కావాలంటే తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం చాలని, ఈ మాత్రం సోయి కూడా ప్రధానికి లేదా? అని విమర్శించారు. మోదీ నుంచి సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ సర్కార్‌కు లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో కేసీఆర్‌ది కుటుంబ, రాచరిక, వారసత్వ పాలన అంటున్న మోదీకి జేడీఎస్‌, శివసేన, పీడీఎఫ్‌, ఎస్పీ, టీడీపీ, అకాలీదళ్‌ వంటి పార్టీలు కుటుంబ, వారసత్వ పార్టీలని గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ‘దేవెగౌడ కొడుకు ఎన్డీయేలో చేరినప్పుడు మోదీకి రాజరికం గుర్తుకురాలేదా? జై షా ఎవరు? అయనకు బీసీసీఐ పదవి ఎలా వచ్చింది?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అసలు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కేవలం ఈడీ, సీబీఐ, ఐటీలే తప్ప మీతో ఉన్నది ఎవరంటూ ఎద్దేవా చేశారు.


బీజేపీతో ఉంటే మంచి, లేకుంటే చెడు అన్నట్లుగా మోదీ వ్యవహారం ఉన్నదని విమర్శించారు. మీ పార్టీలో చేరిన హిమంత బిశ్వశర్మ, సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, నారాయణ రాణే, జ్యోతిరాథిత్య సింథియాలపై కేసులు ఎమయ్యాయని నిలదీశారు. కేసీఆర్‌ ఫైటర్‌ అని, చీటర్లతో కలిసి ఎన్నడు పనిచేయరని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. తాము ఢిల్లీ, గుజరాత్‌లకు గులామ్‌లు కాదని అన్నారు.


ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్‌ చెప్పారని మోదీ అంటున్నారని, ఒకవైపు ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ బయటకు పోతుంటే ఎన్డీయేలో చేరేందుకు తామేమీ పిచ్చివాళ్లం కాదని, తమకు పిచ్చి కుక్క కరువలేదని వ్యాఖ్యానించారు. ‘కర్ణాటక ఎన్నికల్లో మేము కాంగ్రెస్‌కు ఫండింగ్‌ చేస్తుంటే మీ ఐటీ, ఈడీలు ఏం చేస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.


మోదీతో చివరిదాకా తలపడతామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి తాను చాలెంజ్‌ చేస్తున్నానని, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందనీ, ఈసారీ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.