Mulugu | ఉద్యమనేతకు కడసారి కన్నీటి వీడ్కోలు.. ముగిసిన కుసుమ జగదీష్ అంత్యక్రియలు! పాల్గొన్న KTR

మల్లంపల్లిలో ముగిసిన కుసుమ జగదీష్ అంత్యక్రియలు పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తరలివచ్చిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భారీసంఖ్యలో భాగస్వామ్యమైన ప్రజలు ములుగు జిల్లాలో రెండు రోజులు దశాబ్ది ఉత్సవాలు వాయిదా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్యమ నాయకుడు, ములుగు (Mulugu) జిల్లా జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ కు కన్నీటి నివాళుల మధ్య ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు. ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం […]

Mulugu | ఉద్యమనేతకు కడసారి కన్నీటి వీడ్కోలు.. ముగిసిన కుసుమ జగదీష్ అంత్యక్రియలు! పాల్గొన్న KTR
  • మల్లంపల్లిలో ముగిసిన కుసుమ జగదీష్ అంత్యక్రియలు
  • పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్
  • తరలివచ్చిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
  • భారీసంఖ్యలో భాగస్వామ్యమైన ప్రజలు
  • ములుగు జిల్లాలో రెండు రోజులు దశాబ్ది ఉత్సవాలు వాయిదా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్యమ నాయకుడు, ములుగు (Mulugu) జిల్లా జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ కు కన్నీటి నివాళుల మధ్య ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు. ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన కుసుమ జగదీష్ అంత్యక్రియలకు భారీగా జనం తరలివచ్చి కన్నీటి నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరై జగదీష్ భౌతిక కాయంపై పార్టీ జెండాను కప్పి పూలమాలతో నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్

కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న జగదీష్ తల్లి భార్య పిల్లలను కుటుంబ సభ్యులను KTR ఓదార్చేందుకు విఫల యత్నం చేశారు. పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ రాక సందర్భంగా జగదీష్ అమర్ హై, జగదీష్ కు జోహార్లు అంటూ నినాదాలు మిన్నంటాయి.

జగదీష్ జీవితం ఆదర్శనీయం: మంత్రి KTR

ఈ సందర్భంగా మంత్రి KTR మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామమైన వ్యక్తి జగదీష్ అంటూ కొనియాడారు. కెసిఆర్ కు తమ్మునిగా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఓదారుస్తానని ఎప్పుడు అనుకోలేదని చెప్పారు.

ప్రజల కోసం పనిచేసిన జగదీష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని KTR హామీ ఇచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా ప్రజల పట్ల ప్రేమానురాగాలు కనపరిచాడని ఏం సంపాదించుకోలేదని అలాంటి వ్యక్తి కుటుంబానికి తోడుగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ చెప్పారు. ములుగు జిల్లాలో చురుకైన నాయకుడిగా ఉన్న జగదీష్ మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలకు అతీతంగా నివాళులు

పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరితో ఆప్యాయత,ప్రేమతో సాన్నిహిత్యం కలిగి ఉండే జగదీష్ మృతిని ఎవరు జీర్ణించు కోలేకపోయారు. ఆయనతో సంబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రులు, నేతలు అధికారులతో పాటు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, శ్రేణులు భాగస్వామ్యం అయ్యారు.

కేసీఆర్ పరామర్శ – పెద్దికి బాధ్యతలు

ఆదివారమే ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల నిర్వహణ బాధ్యతను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అంత్యక్రియలు సాఫీగా జరిగాయి.

పాడే మోసిన సత్యవతి

అంత్యక్రియలలో స్వయంగా జగదీష్ పాడేమోసిన మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటిపర్యంతమయ్యారు. సజన నయనాల మధ్య జగదీష్ భౌతిక కాయానికి ఆయన కుమారుడు తలకొరివి పెట్టారు. ఈ సందర్భంగా జగదీష్ విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యల పట్ల ఉద్యమాల పట్ల, తెలంగాణ పట్ల ఉన్న సానుకూల వైఖరిని, అంకిత భావాన్ని పలువురు గుర్తు చేశారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

జగదీష్ భవిష్యకాయాన్ని మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వచ్చి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.

జగదీష్ అంత్యక్రియలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జిల్లా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్, మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, మాలోత్ కవిత, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్ నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జగదీష్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగదీష్ మృతి నేపథ్యంలో ములుగు జిల్లాలో రెండు రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను వాయిదా వేశారు.