Minister Ponnam | పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం
బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలంటూ చేసిన ప్రతిపాదనపై కాంగ్రెస్ మంత్రులు మాటల దాడులు సాగిస్తున్నారు

- మంత్రి పొన్నం ఫైర్
Minister Ponnam | విధాత: బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలంటూ చేసిన ప్రతిపాదనపై కాంగ్రెస్ మంత్రులు మాటల దాడులు సాగిస్తున్నారు. పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వంలో పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని, అప్పటి సీఎం అడ్డుకున్నారా లేక స్పీకర్ అడ్డుకున్నారా అంటూ మంత్రి శ్రీధర్‌బాబు నిన్న కవితను నిలదీశారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసం పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవ్వాళ బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కవితపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు.
పది సంవత్సరాలు పాలించిన బీఆరెస్‌కు అప్పుడు పూలే గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. కవిత లిక్కర్ కేసులో బిజీగా లేనట్టున్నారని, అందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. కవిత నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ముందు మీ బీఆరెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులిచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని కవితకు హితవు చెప్పారు. అసెంబ్లీ, మండలి ప్రాంగణాలపై అధికారాలు స్పీకర్, చైర్మన్లకు ఉంటాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామన్నారు.