Minister Puvvada Ajay | విధాత: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఈ జిల్లా బిడ్డగా నా జీవితంలో ఎప్పుడూ చూడని అభివృద్ధి తొమ్మిదేళ్లలో జరిగిందన్నారు.
ఒకప్పుడు గూడేలకి, తండాలకి రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు లేకుండే.. మంచినీళ్లు లేకుండే… మిషన్ భగీరథ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నీళ్ళు ఇచ్చారని మంత్రి పువ్వాడ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాలకు పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోని పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకు ఎనలేని సహాయం చేశారని అన్నారు.
ఖమ్మం (Khammam) జిల్లాలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సైనికులుగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి పువ్వాడ తెలిపారు. రానున్న మూడు నెలల్లో ప్రతి ఇంటి గడపకు వెళ్లి… అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ ద్వారా పెద్దవాళ్ళు అయి పార్టీకి ద్రోహం చేసిన కొంతమంది నాయకులు.. ముఖ్యమంత్రి, కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకులు… నేడు తెలంగాణ అమరవీరుల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.