ధరణితో దొరలకే మేలు.. బీఆరెస్ పై మంత్రి సీతక్క ఫైర్
ధరణితో బీఆరెస్ ప్రభుత్వం భూ దందాకు పాల్పడిందని, దొరలకు మాత్రమే ధరణితో లాభం చేకూరగా, పేదలు, రైతులు అష్టకష్టాలు పడ్డారని

- పేదలకు ఇండ్లు నిర్మించని బీఆరెస్
- 11న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం
- ప్రజల సంపద పెంచడమే కాంగ్రెస్ లక్ష్యం
విధాత, హైదరాబాద్ : ధరణితో బీఆరెస్ ప్రభుత్వం భూ దందాకు పాల్పడిందని, దొరలకు మాత్రమే ధరణితో లాభం చేకూరగా, పేదలు, రైతులు అష్టకష్టాలు పడ్డారని బీఆరెస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క మండిపడ్డారు. బోధ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్‌లో బోధ్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మా బొజ్జతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీలు, గిరిజనులకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణి మాటున మాయం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం ధరణిని ప్రక్షాళన చేయబోతున్నామని తెలిదపారు. పేదలకు కట్టిన డబుల్ ఇండ్లు కూడా ఇవ్వని ప్రభుత్వం అసమర్ధ, అప్పుల పాలన చేసిందని విమర్శించారు. కేవలం కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూపించి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. బీఆరెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని దానికి ప్రతినెలా 70 వేల కోట్లు వడ్డీ తీరుస్తున్నామని తెలిపారు.
సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప పేదలకు ఇండ్లను ఇవ్వలే దుర్మార్గ పాలనను బీఆరెస్ సాగించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించాలన్న హామీ మేరకు ఈ నెల 11న ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతుందని వెల్లడించారు. అదిలాబాద్ నియోజకవర్గానికి 3,500చొప్పున ఇండ్లను మంజూరు చేయనుందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే గ్యారంటీలకు గ్యారెంటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం కాని భోగాల కుటుంబం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ సంపద పెంచుతుందని పేదలకు పంచుతుందని చెప్పారు. పేద ప్రజల కోసం బీజేపీ చేసిందేమి లేదని, కుల మతాల పేరుతో అధికారం కోసం అలజడులు సృష్టిస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ సూటు బూటు ప్రధానమంత్రి అంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు.
బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, కుష్ఠి, ప్రాణహిత ఎత్తిపోతల పథకం, నూతన సోనాల మండల ఏర్పాటు గురించి క్యాబినెట్లో చర్చిస్తానని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సత్తు మల్లేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి, జెడ్పిటిసి నరసయ్య, మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య వైస్ చైర్మన్ అడే వసంత్ నాయక్, అధికార ప్రతినిధి పసుల చంటి అన్ని మండలాల ఎస్సీ బీసీ ఎస్టీ సెల్ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజలు రైతులు పాల్గొన్నారు.