PM Modi: తెలంగాణపై.. మోడీకి మొదటి నుంచి అజీర్తే

విధాత‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు మోడీ మొదటి నుంచి వ్యతిరేకే. ఆయన తన తెలంగాణ వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు. ఆయన ప్రధాని కాకముందే 2014 ఎన్నికల సమయంలో ఏపీకి వెళ్లి తల్లిని చంపి పిల్లను బతికించారని అన్నమాటలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల చెవుల్లో మారు మోగుతుంటాయి. ఆయన అక్కడితో ఆగలేదు. ప్రధాని అయ్యాక పార్లమెంటులో బిల్లులు ఎలా ఆమోదం పొందుతాయో తెలిసి కూడా పార్లమెంటు తలుపులు మూసి, చర్చ లేకుండానే పెప్పర్‌ స్ప్రే ఉపయోగించి తెలంగాణ ఏర్పాటు […]

  • Publish Date - April 8, 2023 / 04:25 PM IST

విధాత‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు మోడీ మొదటి నుంచి వ్యతిరేకే. ఆయన తన తెలంగాణ వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు. ఆయన ప్రధాని కాకముందే 2014 ఎన్నికల సమయంలో ఏపీకి వెళ్లి తల్లిని చంపి పిల్లను బతికించారని అన్నమాటలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల చెవుల్లో మారు మోగుతుంటాయి. ఆయన అక్కడితో ఆగలేదు. ప్రధాని అయ్యాక పార్లమెంటులో బిల్లులు ఎలా ఆమోదం పొందుతాయో తెలిసి కూడా పార్లమెంటు తలుపులు మూసి, చర్చ లేకుండానే పెప్పర్‌ స్ప్రే ఉపయోగించి తెలంగాణ ఏర్పాటు చేశారని తన కడుపులో ఉన్నతెలంగాణ వ్యతిరేక అజీర్తిని వెళ్లగక్కేశారు.

అంతేకాదు వాజపేయీ హయాంలో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను అందరి ఆమోదంతో ఏర్పాటు చేసినట్టు గొప్పలు చెప్పుకుంటారు. అయితే జార్ఖండ్‌ రాష్ట్ర ఏర్పాటుపై బీహార్‌ అసెంబ్లీ జరిగిన రచ్చ గాని, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఏర్పాటుపై ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన ఉదంతం గాని, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఏర్పాటుపై మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన చర్చంతా దేశమంతటికీ తెలుసు.

పాపం మోడీకి ఇవేవీ పట్టవు. ఒకవేళ తెలిసినా ఆయనకు తెలంగాణ అంటే ఒక కశ్మీర్‌లా కనిపిస్తుంది. అందుకే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అప్పుడూ ఇప్పుడూ వ్యతిరేకిస్తుంటారు. తెలంగాణపై మోడీ వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రజల దశాబ్దాల పోరాటాన్ని మోడీ పార్లమెంటులో అనేకసార్లు అవహేళన చేశారు. ఇక్కడ ప్రజల అస్తిత్వాన్నిప్రశ్నించారు. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీని, ముఖ్యంగా మోడీ లాంటి వాళ్ల మాటలు ఉద్యమ సమయంలోనూ, అనంతరమూ విశ్వసించడం లేదు.

మూజువాణి ఓటుతో ఆమోదం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదన్న ప్రధాని అవగాహనా రాహిత్యానికి జాలి పడటం తప్పా ఏమీ చేయలేము. ఎందుకంటే లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందినా.. రాజ్యసభలో నాటి బీజేపీ పక్ష నేత అరుణ్‌జైట్లీ సహా, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, ప్రకాశ్‌జవదేకర్‌ లాంటి వాళ్లు చర్చలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు ఏపీ ప్రయోజనాలను కాపాడటం కోసం అనేక సవరణలు ప్రతిపాదించారు. వాటిలో కొన్నింటిని తిరస్కరించినా కొన్నింటిని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సభలో అంగీకరించి, హామీ ఇచ్చిన విషయం మోడీ మరిచిపోయారు కావొచ్చు.

ఆయనకు జ్ఞాపకం లేకపోతే నాడు చర్చలో పాల్గొన్న బీజేపీ నేతల్లో అరుణ్‌జ్లైట్లీ మన మధ్య లేకపోవచ్చు. కానీ వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, ప్రకాశ్‌జవదేకర్‌లను అడుగవచ్చు. లేదా రాజ్యసభ రికార్డులను పరిశీలించవచ్చు. అయితే ఇలాంటివి బీజేపీ నేతలకు రుచించవు.

ఎందుకంటే అధికారం కోసం అబద్ధాలనైనా ప్రచారం చేయండి అన్న ఆ పార్టీ జాతీయ నేత అమిత్‌ షా మాటలను ప్రధాని సహా అందరూ ఆచరణలో పెట్టారు. అందుకే బీజేపీ వాట్సప్‌ యూనివర్సిటీలో అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. ఇది దేశ ప్రజలందరి అనుభవంలో ఉన్నదే.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సోనియాగాంధీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కమిటీల పేరుతో కాలయాపన చేసినా.. సోనియాగాంధీ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం, ఉద్యమ నాయకత్వ రాజకీయ చతురత, అమరుల త్యాగాలు, ముఖ్యంగా సోనియా సంకల్పం వల్లనే దశాబ్దాల తెలంగాణ ప్రజల రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది.

ఒకవేళ కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే బీజేపీ ఇచ్చేది కాదు. ఎందుకంటే 2001లో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు.. కాకినాడ తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదంటే.. ఎన్డీఏలో తమ భాగస్వామ్య పార్టీ టీడీపీ కోసం ఇక్కడి ప్రజల ఆకాంక్షను తొక్కిపెట్టింది వాస్తవం కాదా? తెలంగాణ ఏర్పాటుపై జరిగిన చర్చ దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరగలేదంటే అతిశయోక్తి కాదు.

గాంధేయమార్గంలో శాంతియుతంగా..

ఉద్యమ సమయంలోనూ ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎంత రెచ్చగొట్టినా.. ఉద్యమ నాయకత్వం రెచ్చిపోకుండా సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో గాంధేయమార్గంలో శాంతియుతంగా రాష్ట్రాన్ని సాధించుకున్నచరిత్ర ఇక్కడి ప్రజలది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనూ సంయమనంగా ఉన్నాము గాని గుజరాత్‌ లో ఓట్ల కోసం, అధికారం కోసం జరిగినట్టు ఇక్కడ మారణహోమాలేవీ జరగలేదు. అంతెందుకు 2014 ఎన్నికల్లో చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు తాము అనుకూలమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలుచేయకపోగా.. 2019 మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానాన్ని ఎత్తివేసింది ప్రస్తుత ప్రధాని నాయకత్వంలో కాదా?

తొమ్మిదేళ్ల కాలంలో విభజన సమస్యలను పరిష్కరించలేదు..

ఇవాళ అధికారిక కార్యక్రమంలోనూ రాజకీయాలు మాట్లాడటం మోడీ లాంటి వాళ్లకే చెల్లుంది. ఇక కేంద్రం అభివృద్ధి చేస్తుంటే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వ సహకరించడం లేదన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అధికార పార్టీ సీఎం మొదలు మంత్రులు, విపక్ష సభ్యులైన కాంగ్రెస్‌ ఎంపీలు కూడా పార్లమెంటులో ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. తన తొమ్మిదేళ్ల కాలంలో విభజన సమస్యలను పరిష్కరించలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై స్పందించలేదు. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో రాజకీయం చేయడానికి బూచిగా చూపెట్టడానికి ఎంఐఎం లాంటి పార్టీ ఉండనే ఉన్నది.

తెలంగాణ ప్రజలపై ఇసుమంత ప్రేమ లేదు

గంగా జెమునా తెహజీబ్‌ లాంటి ఇక్కడి సంస్కృతిపై విద్వేషం వెళ్లగక్కి నాలుగు ఓట్లు సంపాదించాలనే ఆలోచన తప్పా తెలంగాణ ప్రజలపై బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇసుమంత ప్రేమ కూడా లేదు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలి? లేకపోతే ఏక్‌నాథ్‌షిండేలను సృష్టించాలన్నది ఆ పార్టీ నేతలు నిత్యం చేస్తున్న వ్యాఖ్యలతో అవగతమౌతుంది.

మోడీ గారూ…మీకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మీ అయిష్టతను ఎట్లాగూ దాచుకోలేదు. ఇంకా ఆ ముసుగు తొలిగించి మీ మనసులో మాట అయినా చెబితే కనీసం మీ కార్యకర్తలకైనా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరు ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం అని నమ్మే కొంతమంది భ్రమలు అయినా తొలిగించుకునే అవకాశం ఇచ్చినవాళ్లు అవుతారు.