విశాఖలో విధ్వంసం: మోడీ సభ.. చెట్లు, కొట్లు కూల్చివేత!

విధాత: ఈనెల 12న విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ వస్తున్నవేళ ఇక్కడి పాలకులు విధ్వంసంతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఓ వైపు వందలాది చెట్లు నేల కూల్చేసి మరో వైపు పదుల సంఖ్యలో దుకాణాలు తొలగించి చిరు వ్యాపారులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ఈ విపరీత చర్యలు ఎవరి మెహర్భాని కోసం చేస్తున్నారో కానీ మొత్తానికి చరిత్రాత్మక ఆంధ్రా యూనివర్సిటీని శిథిలం చేస్తున్నారు. ఎయు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో మోడీ […]

  • Publish Date - November 9, 2022 / 06:13 AM IST

విధాత: ఈనెల 12న విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ వస్తున్నవేళ ఇక్కడి పాలకులు విధ్వంసంతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఓ వైపు వందలాది చెట్లు నేల కూల్చేసి మరో వైపు పదుల సంఖ్యలో దుకాణాలు తొలగించి చిరు వ్యాపారులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. ఈ విపరీత చర్యలు ఎవరి మెహర్భాని కోసం చేస్తున్నారో కానీ మొత్తానికి చరిత్రాత్మక ఆంధ్రా యూనివర్సిటీని శిథిలం చేస్తున్నారు.

ఎయు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో మోడీ సభను ఏర్పాటు చేస్తుండగా దానికి సమీపంలోని వందలాది సరుగుడు నీలగిరి చెట్లను తొలగించేస్తున్నారు. ఒక్కపూట ప్రధాని సభ కోసం ఏళ్లతరబడి పెరిగిన చెట్లను కొట్టేయడం ఏమిటన్న ప్రశ్నలు ప్రజలు లెవనెత్తుతుండగా ఈ లోపే రాత్రికి రాత్రి ఈ కూల్చివేతలు పూర్తి చేసేస్తున్నారు.

ఈనెల 12న ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం హాజరవుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సభ జరిగే మైదానం వద్ద టీ కొట్లు, కార్ షెడ్.. చికెన్ స్టాల్.. టిఫిన్ సెంటర్లు ఓ పాతిక వరకూ ఉంటాయి. సభ జరిగే 13న దుకాణాలు తీయవద్దంటూ పది రోజులు క్రితం అధికారులు ఆ దుకాణ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ హఠాత్తుగా సోమవారం అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా మున్సిపల్ సిబ్బంది జెసిబిలతో తమ దుకాణాలను కూల్చివేశారు.

పాతికేళ్లుగా ఈ దుకాణాలే తమకు అన్నం పెడుతున్నాయని కనీసం మాట మాత్రం చెప్పకుండా రాత్రికి రాత్రి దుకాణాలు కూల్చివేయడం ఏం న్యాయమని వారు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఆరోజు దుకాణాలు తెరవవద్దని మాత్రమే చెప్పారని దుకాణాలు కూల్చివేస్తామని చెప్పి ఉంటే తమ సామాగ్రిని వేరే చోటికి తరలించుకుని ఉండే వారమని వారు వాపోతున్నారు.

ఇదిలా ఉండగా వర్సిటీలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా వర్శిటీ విసి ప్రసాదరెడ్డి.. విజయసాయిరెడ్డి యిద్దరూ కలిసి వేరే రహస్య ఎజెండాతో ఇలా వర్శిటీ ఆస్తులను విధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా వారు తమపని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.