Mokshagna | ఏంటి మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైందా? ఈసారైనా నమ్మవచ్చా?

Mokshagna విధాత‌: బాలకృష్ణ, మోహిని హీరోహీరోయిన్లుగా టినూ ఆనంద్, అమ్రీష్ పురి, సిల్క్ స్మిత, గొల్లపూడి మారుతీరావు వంటి భారీ తారాగణంతో 1991లో విడుదలైన మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా అప్పట్లో ఓ కొత్త ప్రయోగం. సైన్స్‌ఫిక్షన్‌ స్టోరీకి కాస్త ప్రేమ, క్రైమ్, యాక్షన్ అన్ని జోడించి సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని తెరకెక్కించారు. ‘ఆదిత్య 369’ ఇప్పటికీ బాలయ్య నటించిన సినిమాలన్నింటిలోకీ ప్రత్యేకంగా నిలుస్తుందంటే ఆ సినిమాకున్న, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది. […]

Mokshagna | ఏంటి మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైందా? ఈసారైనా నమ్మవచ్చా?

Mokshagna

విధాత‌: బాలకృష్ణ, మోహిని హీరోహీరోయిన్లుగా టినూ ఆనంద్, అమ్రీష్ పురి, సిల్క్ స్మిత, గొల్లపూడి మారుతీరావు వంటి భారీ తారాగణంతో 1991లో విడుదలైన మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా అప్పట్లో ఓ కొత్త ప్రయోగం. సైన్స్‌ఫిక్షన్‌ స్టోరీకి కాస్త ప్రేమ, క్రైమ్, యాక్షన్ అన్ని జోడించి సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని తెరకెక్కించారు.

‘ఆదిత్య 369’ ఇప్పటికీ బాలయ్య నటించిన సినిమాలన్నింటిలోకీ ప్రత్యేకంగా నిలుస్తుందంటే ఆ సినిమాకున్న, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా.. ‘ఆదిత్య 999’ పేరుతో బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినబడుతున్నాయి. కానీ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. అదిగో ఇదిగో అనే మాటలే కానీ.. చేతల వరకు ఇంకా అది పోవడం లేదు.

నందమూరి అభిమానులు బాలయ్య ఫ్యామిలీ నుంచి మోక్షు ఎంట్రీ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్యాన్స్ ఒత్తిడి తట్టుకోలేక బాలయ్య గతంలో కూడా కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి పలుమార్లు చెప్పినా, అవేమీ పట్టాలు ఎక్కలేదు. ఓ పక్క ఇరవై ఎనిమిదేళ్ళు దాటిపోతున్నా మోక్షజ్ఞ సినిమాల్లోకి రాకపోవడాన్ని అతనికి మూవీల మీద ఇష్టం లేదనే కోణంలో నెట్టింట ప్రచారం కూడా చేశారు.

ఇదిలా ఉంటే అదే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి పదిహేడేళ్ళకే వచ్చేశాడు. ఇక బాలకృష్ణ చిన్నతనం నుంచే నటనలో ఉన్నాడు. అటు నాన్నలా కానీ, అటు అన్నలా కానీ మోక్షు సినిమాల్లోకి రావడాన్ని ఉత్సాహంగా తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు సినీ జనాలు.

అయితే.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అంతా సిద్ధమైందనేలా వార్తలు కాస్త జోరందుకున్నాయి. బాలకృష్ణ చేసిన ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999’ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయట. దీనికోసం కాస్త ఒళ్ళు తగ్గి స్లిమ్‌గా, హ్యాండ్సమ్ లుక్‌లోకి మారుతున్నాడు మోక్షజ్ఞ. ఇదంతా సినీ ఎంట్రీకేనని తెగ హ్యాపీ‌గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

అయితే గతంలోనూ నాలుగైదు సార్లు ఇలానే బాలయ్య అనడం ఆ ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కకపోవడంతో ఇది ఎంతవరకూ నిజమో అనుకుంటున్నారు కానీ, స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుండటంతో ‘ఆదిత్య 999’ రావడం పక్కా అని తెలుస్తుంది.

దీంతో ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఖరారయినట్టే అని ఫిక్సయిపోవచ్చు. రీసెంట్‌గా బాలయ్య కూడా మోక్షు ఎంట్రీ గురించి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలోనే అనేలా ఆయన చెప్పడంతో.. ఫ్యాన్స్‌లో కూడా ఉత్సాహం మొదలైంది.

ఇక బాలయ్య విషయానికి వస్తే.. ప్రజంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’ షూటింగ్ యమా జోరుగా సాగుతుంది. బాలయ్య 109వ సినిమా దర్శకుడు బాబీతో చేయనున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.