ఆర్టిమిస్ (Artemis) మిషన్ ద్వారా చంద్రుని (Moon) పై వ్యోమగాముల (Astronauts) ను దింపాలని నాసా నిర్దేశించుకున్న ప్రదేశంలో భూకంపాలు (Moonquakes) సంభవించడానికి ఎక్కువ అవకాశాలున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ప్రదేశంలో చంద్రుని ఉపరితలం చాలా బలహీనంగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆర్టిమిస్-3 అనే మిషన్‌లో భాగంగా ఈ ప్రాంతంలోనే నాసా వ్యోమగాములను దించాలని నిర్ణయించుకుంది. 2026లో ఈ ప్రయోగం జరగనుండగా.. దాని కోసం అక్కడి ఉపరితలం సామర్థ్యంపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.
కంప్యూటర్ సిమ్యులేషన్ ఫలితాల ప్రకారం.. ఆర్టిమిస్-3 దిగేచోట..మూన్‌క్వేక్స్ వస్తాయని తేలింది. ఆర్టిమిస్ ప్రయోగ సన్నద్ధతలో ఇది కీలకం అని వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన టాం వాటర్స్ వివరించారు. చంద్రునిపై శాశ్వత ఆవాసాలను ఏర్పరిచేందుకు కానీ.. లేదా భారీ వ్యోమనౌకలను నిలిపి ఉంచేందుకు గానీ అక్కడి నేల స్వభావాన్ని తెలుసుకోవడం అత్యవసరం. ఒకవేళ అక్కడ భూమి కింద ఏదైనా బిలం లాంటిది ఉన్నట్లయితే.. రాకెట్ తాకినప్పుడు అది కూలిపోయి.. గొలుసుకట్ట చర్యగా స్వల్ప స్థాయిలో భూకంపాలు వచ్చే అవకాశుముంటుంది. తాజా అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు నాసా పంపిన లునార్ రికనాయ్‌సెన్స్ ఆర్బిటర్ అందించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషంచారు.
ఈ పరిశోధనలో.. దక్షిణ ధ్రువం వద్ద భూకంపాలు ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తేలింది. అంతే కాకుండా అక్కడి వాలు ప్రాంతాలు వదులుగా ఉండి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ‘ఆర్టిమిస్ ప్రయోగానికి సమయం దగ్గర పడుతుండటంతో.. గట్టిగా స్థిరంగా ఉండే లాంచింగ్ ప్రదేశాన్ని నిర్దేశించడం నాసాకు అవసరం. చంద్రునిపై ఏమేమి ముప్పులు మన కోసం ఎదురు చూస్తున్నాయో అర్థం చేసుకునే కోణంలో ఈ వివరాలు మనకు అక్కరకొస్తాయి. అక్కడకు వెళ్లే వ్యోమగాములు, విలువైన పరికరాల భద్రత చాలా ముఖ్యం. వాటిని మూన్‌క్వేక్స్ నుంచి రక్షించడానికి ఇలాంటి లోతైన పరిశోధనలు అవసరం’ అని పరిశోధకుల్లో ఒకరైన భూగర్భ శాస్త్రవేత్త నికోలస్ షిమర్ అభిప్రాయపడ్డారు.