బీజింగ్‌ కాదు.. ఆసియాలో శతకోటీశ్వరుల నగరమేదో తెలుసా?

పెద్ద సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా ఇప్పటి వరకూ బీజింగ్‌కు ఉన్న రికార్డును ముంబై చెరిపేసింది

  • By: Somu    latest    Mar 27, 2024 11:51 AM IST
బీజింగ్‌ కాదు.. ఆసియాలో శతకోటీశ్వరుల నగరమేదో తెలుసా?

ముంబై: పెద్ద సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా ఇప్పటి వరకూ బీజింగ్‌కు ఉన్న రికార్డును ముంబై చెరిపేసింది. మొట్టమొదటిసారి ‘ఆసియన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ బిలియనీర్స్‌’ టైటిల్‌ను అందుకున్నదని హురున్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితా వెల్లడించింది. సంపద సృష్టిలో ఆసియాలోనే ముంబై అగ్రభాగాన నిలిచింది.


ఒకవైపు దేశాన్ని పేదరికం పట్టి పీడిస్తూ.. ఇప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతుంటే.. మరోవైపు కుబేరుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 119 మంది బిలియనీర్లతో న్యూయార్క్‌ అగ్రస్థానంలో నిలువగా, 97 మందితో లండన్‌ రెండో స్థానంలో నిలిచింది.


భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 92 మంది బిలియనీర్లు ఉన్నారు. చైనాలోని బీజింగ్‌ 91 మంది, అదే దేశంలోని షాంఘైనగరం 87 మంది బిలియనీర్లను కలిగి ఉన్నది. ఈ విషయంలో ముంబై మొదటిసారి ఆ రెండు నగరాలను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నది.


ప్రపంచవ్యాప్తంగా 3,279 మంది బిలియనీర్ల ఉన్నట్టు హురున్‌ జాబితా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే వీరి సంఖ్యలో 5 శాతం పెరుగుదల ఉన్నది. 814 మంది కుబేరులతో చైనా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. వారి సంఖ్య గత ఏడాదికంటే గణనీయంగా తగ్గి, 155 మంది బిలియనీర్లతో ఉన్నది. రెండో స్థానంలో నిలిచిన అమెరికాలో 800 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక మూడో స్థానంలో 271 మంది బిలియనీర్లతో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది.


చైనాకు ఆ ఏడాది సవాలు. సంపద సృష్టిలో ఇటీవలి కాలంలో చైనాలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా బిలియనీర్ల సంఖ్యలో తగ్గుదల కనిపించింది’ అని హురున్‌ సంస్థ తెలిపింది.

చైనాలో అత్యంత ధనికుడిగా నాగ్‌ఫు స్ప్రింగ్‌ చైర్మన్‌, ఫౌండర్‌ ఝాంగ్‌ షాన్‌షాన్‌ మరోసారి తన స్థానం నిలబెట్టుకున్నారు. టెన్సెట్‌ సీఈవో మా హువాటెంగ్‌ను అధిగమించి పిన్‌డ్యూడ్యూ ఫౌండర్‌ కొలిన్‌ హువాంగ్‌ రెండో స్థానానికి ఎగబాకారు.


అమెరికాలో అతిసంపన్న వ్యక్తుల పెరుగుదలలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించిందని హురున్‌ సంస్థ పేర్కొన్నది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఆరకిల్‌, మెటా వంటి బడా కంపెనీలకు చెందిన బిలియనీర్లు ఏఐ రంగంలో పెట్టిన పెట్టుబడులతో సంపద పెద్ద ఎత్తున పెరిగిందని రిపోర్టు పేర్కొన్నది.


బ్లూంబెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అమెరికాలో టాప్‌ 2 బిలియనీర్లుగా ఉన్నారు. బెజోస్‌కు 201 బిలియన్‌ డాలర్ల సంపద ఉండగా.. మస్క్‌కు 190 బిలియన్‌ డాలర్ల సంపద ఉన్నది. 1.2 బిలియన్‌ డాలర్లతో పాప్‌సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ హురున్‌ రిసెర్చ్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నది. ఆమె నిర్వహించిన ఎరాస్‌ టూర్‌ విజయవంతం కావడంతో ఆమె సంపద పెరిగింది.


ఇదిలా ఉంటే.. కొత్తగా బిలియనీర్లు అవుతున్న దేశాల్లో భారతదేశం రెండోస్థానంలో ఉన్నది. గత ఏడాదితో పోల్చితే 84 మంది కొత్త కుబేరులు అవతరించారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని పదిలంగానే ఉంచుకున్నారు. గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో 110 బిలియన్‌ డాలర్లతో 11వ స్థానంలో నిలిచారు.


అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతం అదానీ జనవరిలో ముకేశ్‌ను దాటినట్టు అనిపించినా.. మూడు ర్యాంకులు తగ్గి.. 97.9 బిలియన్‌ డాలర్ల సంపద కలిగి ఉన్నారని బ్లూంబెర్గ్‌ డాటా పేర్కొంటున్నది.