విధాత: తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతున్నదన్నారు. రాజ్‌భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫౌంహౌజ్ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగే ప్రయత్నం చేశారని, నా మాజీ ఏడీసీ తుషార్‌ను ఈ కేసులోకి తీసుకొచ్చిన కారణం అదేనని అన్నారు. తుషార్ ఫోన్ చేసి దిపావళి శుభాకాంక్షలు తెలిపితే ఆయన పేరు ఇందులోకి ఎలా తెచ్చారు? అని ప్రశ్నించారు.
తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రజల సమస్యల విషయంలో ఎల్లప్పుడూ సానుకూలంగానే స్పందిస్తానన్నారు. ప్రగతి భవన్‌లా కాకుండా ప్రజల కోసం రాజ్ భవన్ ద్వారాలు ఎప్పుడు తెరచి ఉంటాయని అన్నారు. తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. సీఎంవో నుంచి మంత్రికి లేఖ రావడానికి జాప్యమైతే సమస్యలు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతాయని నిలదీశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు.
తన పర్యటనల గురించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తున్నానని చెప్పారు. ప్రొటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్‌భవన్ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తున్నారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు.
రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తారని విద్యార్థుల ఐకాస పేరిట వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్ భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. బాసర విద్యార్థులు వచ్చారని, మిగతా విద్యార్థులు తనను కలుసుకునేందుకు వచ్చారని గుర్తు చేశారు. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరుచుకుని ఉంటాయని.. ప్రగతిభవన్ మాదిరిగా కాదని ఎద్దేవా చేశారు
బిల్లులు ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తున్నానని, న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా? నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చానన్నారు. బోధనా పోస్టులు భర్తీ చేయాలని మొదటి నుంచీ చెప్తున్నానని, కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చింది? అని గవర్నర్ ప్రశ్నించారు.
వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయని, ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చానన్నారు. నేను పదే పదే డిమాండ్ చేశాక వీసీలను నియమించారని, బిల్లులను తొక్కి పెట్టాననడం సరికాదన్నారు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని గవర్నర్ స్పష్టం చేశారు. కొత్త విధానంపై నాకు సందేహాలు ఉన్నాయని, కొత్త విధానం అవసరమా కాదా అని పరిశీలిస్తున్నానని స్పష్టం చేశారు.