మళ్లీ యువగళం పాదయాత్ర.. బాబు అరెస్టుపై ద్విముఖ పోరాటం

విధాత: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ యువగళం పాదయాత్రను వచ్చేవారం పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా పాదయాత్ర ఆగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే తిరిగి యువగళం పాదయాత్ర కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు పై ఒకవైపు న్యాయపోరాటం చేస్తునే, ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలని, అరెస్టు వివాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలన్న పార్టీ వ్యూహాంలో భాగంగా మళ్లీ యువగళం పాదయాత్ర కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోనే ఉన్న లోకేశ్ న్యాయవాదులతో నిత్యం సంప్రదింపులు చేస్తు బాబు కేసులో న్యాయపోరాటాన్ని సాగిస్తున్నారు.
ఇదే సమయంలో యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని లోకేశ్‌కు పార్టీ సూచించింది. పాదయాత్ర మొదలైతే లోకేశ్‌ను జగన్ ప్రభుత్వం అరెస్టు చేస్తే పాదయాత్రను నారా బ్రాహ్మిణి కొనసాగించనుందని పార్టీ వర్గాాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం చంద్రబాబు నాయుడు అరెస్టు, తదనంతర పరిణామాలపై నారా లోకేశ్ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని ఈ సందర్భంగా పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
బాబు అరెస్టు సందర్భంగా ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని పార్టీ నేతలు ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింత గా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు.