Super Earth | సూపర్ ఎర్త్ కనుగొన్న నాసా..! అచ్చం మన భూమిలాగే ఉందంట.!
విశ్వంలో భూమి తరహాలో నివాసయోగ్యమైన గ్రహం ఎక్కడైనా ఉందా? అని తెలుసుకునేందుకు ఎన్నో సంవత్సరాలుగా ఖగోళశాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు

Super Earth | విశ్వంలో భూమి తరహాలో నివాసయోగ్యమైన గ్రహం ఎక్కడైనా ఉందా? అని తెలుసుకునేందుకు ఎన్నో సంవత్సరాలుగా ఖగోళశాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నిత్యం అనంతకోటి విశ్వంలో భూమిని పోలి ఉన్న గ్రహం కోసం జల్లెడపడుతున్నారు. తాజాగా భూమి గ్రహం తరహాలోనే ఉన్నా ‘సూపర్ ఎర్త్’ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహం భూమికి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. ఈ సూపర్ ఎర్త్ గ్రహం ఓ రెడ్ డ్వార్ఫ్ చుట్టూ తిరుగుతున్నది. దీనికి టీఓఐ71బీ (TOI-715 B) అని పేరు పెట్టారు. అయితే, సూపర్ ఎర్త్ మన భూమికన్నా దాదాపు ఒకన్నటిర రెట్లు పెద్దగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మిల్కీ వే గెలాక్సీలోని సూర్యుడు కాకుండా విశ్వంలోని ఇతర నక్షత్ర వ్యవస్థల్లో ఉన్న మన భూమి కన్నా పెద్దగా ఉండి.. నెప్ట్యూన్, యురెనెస్ కన్నా చిన్నా ఉండే గ్రహాలను సూపర్ ఎర్త్ పేరుతో పిలుస్తుంటారు. ఈ గ్రహం జీవాల మనుగడకు తోడ్పగలదని భావిస్తున్నారు. సూపర్ ఎర్త్ భూమికి తక్కువ దూరంలోనే ఉందని నాసా పేర్కొంది. కొత్త గ్రహాన్ని ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) ద్వారా గుర్తించినట్లు తెలిపింది. సూర్యుడి కన్నా చిన్నగా, చల్లగా ఉండే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని చెప్పింది. ఈ గ్రహం కేవలం 19 రోజులకే ఒకసారి డ్వార్ఫ్ నక్షత్రాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తుందని పేర్కొంది.
భూమి ఏడాది.. సూపర్ ఎర్త్‌పై 19 రోజులకే గడిచిపోతుందని తెలిపింది. భూమి మాదిరిగానే ఇది కూడా తన నక్షత్రం చుట్టూ జీవుల నివాసానికి అనుకూలమైనంత దూరం అంటే హాబిటబుల్ జోన్‌లోనే ఉందని, ఈ గ్రహంపై నీళ్లు, వాతావరణం ఉండే అవకాశం ఉందని మాత్రమే ప్రస్తుతం అంచనాకు వచ్చినట్లు నాసా పేర్కొంది. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) కొత్త గ్రహాన్ని గుర్తించింది. ఈ గ్రహాన్ని అంతరిక్ష సంస్థ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గ్రహాన్ని పరిశీలించాలని యోచిస్తున్నది. దాంతో మరింత ఖచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని నాసా సైంటిస్టులు వివరించారు. గ్రహాన్ని ‘వాటర్ వరల్డ్’ వర్గీకరించవచ్చా అనేది దాని వాతావరణం, ఇతర లక్షణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.