Nipah Virus | కొవిడ్ కంటే నిఫా అత్యంత ప్రమాదకరం.. హెచ్చరించిన ICMR
Nipah Virus | ఓ రెండేండ్ల పాటు ప్రపంచాన్ని కొవిడ్ గజగజ వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన మరో వైరస్ కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే నిఫా వైరస్. ఈ వైరస్ కొవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) హెచ్చరించింది. కరోనా కేసుల్లో మరణాలు 2 నుంచి 3 శాతం మాత్రమే ఉండగా, నిఫా వల్ల 40 నుంచి 70 శాతం ఉంటాయని ఐసీఎంఆర్ పేర్కొంది. […]

Nipah Virus |
ఓ రెండేండ్ల పాటు ప్రపంచాన్ని కొవిడ్ గజగజ వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన మరో వైరస్ కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే నిఫా వైరస్. ఈ వైరస్ కొవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) హెచ్చరించింది. కరోనా కేసుల్లో మరణాలు 2 నుంచి 3 శాతం మాత్రమే ఉండగా, నిఫా వల్ల 40 నుంచి 70 శాతం ఉంటాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేరళ రాష్ట్రంలో నిఫా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పటి వరకు తెలియలేదన్నారు. మొత్తానికి ఈ వైరస్‌ను నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం 10 మంది రోగులకు సరిపడా మోనోక్లీనల్ యాంటీబాడీ మందు ఐసీఎంఆర్ వద్ద ఉందన్నారు. మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తామన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు నిఫా వైరస్ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్ యాంటీబాడీల మెడిసిన్ ఇవ్వలేదు. ఇన్ఫెక్షన్లు ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఈ మెడిసిన్ వినియోగించాలన్నారు.
నిఫా వైరస్ గబ్బిలాల నుంచి మనషులకు వ్యాప్తించినట్లు 2018లో వెల్లడైంది. కానీ ఈ వైరస్ గబ్బిలాల నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో కచ్చితంగా చెప్పలేం అని బహల్ పేర్కొన్నారు. అయితే విదేశాల్లో ఉన్న 14 మంది నిఫా బాధితులకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చారని, వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.