విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కెసిఆర్ తప్పులపై చర్చ జరగకుండా పక్కదోవ పట్టించేందుకే మా కేసులు మోపుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. కెసిఆర్ చేసిన తప్పులు, పొరపాట్ల అంశాలన్నింటినీ పక్కదోవ పట్టించే ప్రయత్నమే లీకేజీ కేసులు. కెసిఆర్‌ను ఓడగొట్టెంత వరకు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవరకు ప్రజలకు అండగా ఉంటా. ఇది ఒక అక్రమ కేసు. TSPSC పేపర్ లీకు నుండి డైవర్ట్ చేయడానికే ssc కేసు అంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
పేపర్ లీకేజీ వ్యవహారంపై సోమవారం తన విచారణ ముగిసిన అనంతరం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ నాకు ఎలాంటి వాట్స్ ఆప్ కాల్ రాలేదు. వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను.
పరీక్షల సమయంలో ఒక ప్రధాన మంత్రి నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి నరేంద్ర మోడీ ధైర్యం చెప్తున్నారంటే అలాంటి పార్టీలో నేను ఉన్నాను. మా పార్టీ పిల్లల భవిష్యత్తు కోరే పార్టీ.
9.30 కి పరీక్ష మొదలు అయితే 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారు? కెసిఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ఎలా అయినా మమ్ముల్ని ఇరికించాలని కుట్ర పూరితంగా మా మీద కేసులు పెట్టించారు. Tspsc ఆరు పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయి నెగెటివ్ చర్చ జరుగుతుంని దానిని డైవర్ట్ చెయ్యడానికి ఈ కేసులు. చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే ఆ చర్చ జరగవద్దని పక్కదోవ పట్టిస్తున్నారు.
లిక్కర్ కేసుపై చర్చ జరగవద్దనే డైవర్ట్
రాజ్ దీప్ సర్దేశయ్ చెప్తున్నారు కెసిఆర్ దేశమంతా ఎన్నికలకోసం ఖర్చు పెడతా అని ఆ అంశం మీద చర్చ జరగవద్దని ఈ కేసులుగా ఈటెల అభివర్ణించారు. తెలంగాణలో డైట్ చార్జీలు ఇవ్వరు, పెన్షన్ సకాలంలో ఇవ్వరు, కాంట్రాక్టర్లకు డబ్బులు రావు. కానీ దేశమంతా ఎన్నికల ఖర్చు పెడతారట అంటూ ఎత్తిచూపారు.
లాయర్లతో కలిసి విచారణ హాజరైన ఈటెల
SSC హిందీ పేపర్ లీకేజీ కేసులో వరంగల్ సెంట్రల్ జోన్ DCP కార్యాలయంలో పోలీసులకి బిజెపి నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం స్టేట్మెంట్ ఇచ్చారు. బిజెపి లీగల్ టీం లాయర్లతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు.
ఈటెల తన ఫోన్ ను పోలీసులకి ఇచ్చారు. కావాల్సిన సమాచారం అందజేశారు. పోలీసులు నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుండి ఎలాంటి వాట్స్ ఆప్ మెసేజ్ రాలేదు. వేరే నంబర్ నుండి వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదని పోలీసులకి వివరించారు.
ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించుకున్నారు. మరికొన్ని విషయాలపై ఈటెల రాజేందర్ సాధారణ ప్రశ్నలతో సమాధానం రాబట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఈ వ్యవహారం కొనసాగింది. విచారణ ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు ఇటు బిజెపి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
భారీగా తరలివచ్చిన ఈటెల అనుచరులు
వరంగల్ పోలీసుల ముందు తన స్టేట్మెంట్ రికార్డు కోసం పోలీస్ కమిషనరేట్ కు వచ్చిన హైదరాబాద్ ఎమ్మెల్యే ఈటెల వెంట ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హుజరాబాద్ నియోజకవర్గం బిజెపి నాయకులు, హనుమకొండ జిల్లా బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈటెల జిందాబాద్, కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
భారీ పోలీసు బందోబస్తు
ఈటెల రాజేందర్ విచారణ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈటెల విచారణ నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ముందుగానే అంచనా వేసిన పోలీసులు ఈ మేరకు తగిన చర్యలు తీసుకున్నారు.
ప్రతి సోమవారం పోలీస్ కమిషనర్ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ను కూడా వాయిదా వేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రావు, పద్మ కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ధర్మారావు, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.