విధాత: ఏపీ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్టు తెలిసింది. ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్ ఆమోదించినట్టు సమాచారం. సోమేశ్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవీ నుంచి తొలిగించింది.
దీంతో ఆయన అప్పుడే వీఆర్‌ఎస్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా చేరుతారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన జనవరి 12న అమరావతికి వెళ్లి రిపోర్టు చేసి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన నెల రోజులు దాటుతున్నా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నారని ఆయన దరఖాస్తును ఏపీ సీఎం ఆమోదించినట్టు సమాచారం.
మూడేళ్లు తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్‌కు మంత్రుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉండేదనే ప్రచారం ఉన్నది. ముఖ్యమంత్రితో ఆయనకు ఉండే సాన్నిహిత్యంతో ఆయన ఎవ్వరినీ పెద్దగా లెక్కలోకి తీసుకోక పోయేవారని అంటారు. ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వానికి రైతుల నుంచి, ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తమైనా ఆయనపై చర్యలు తీసుకోలేదు.
ఒకానొక సందర్బంలో ఆయనపై వేటు ఖాయమనుకున్నారు. కానీ అవన్నీ ఉత్త ప్రచారాలే అని తేలింది. విభజన చట్టం ప్రకారం ఆయన ఏపీకి వెళ్లాలని 2017 నుంచి కోర్టు కేసు నడుస్తున్నా ప్రభుత్వం దీనిని సీరియస్‌గా పట్టించుకోలేదు.
కానీ హైకోర్టు ఆయన ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. అప్పుడే సోమేశ్‌ను సమయం సందర్భం చూసి రాష్ట్ర ప్రభుత్వం వదిలించుకున్నదని అనుకున్నారు.
ధరణి పోర్టల్, 317జీవో వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటన్నంటికి కారణం సోమేశ్ నిర్ణయమేనని, ఆయన ఏపీ క్యాడర్‌కు వెళ్లకుండా వీఆర్‌ఎస్ తీసుకుని తిరిగి రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుగా చేరితే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ భావించి ఉండొచ్చు. అందుకే ఆయన రిలీవ్ చేసి కొంత రిలీఫ్ పొందారనే అభిప్రాయం ఉన్నది. అయితే ఏపీలో పోస్టింగ్ లేక ఇక్కడ పదవీ దక్కక సోమేశ్‌కు చేదు అనుభవం ఎదురైందనే వాదనలు వినిపిస్తున్నాయి.