NTPC: తెలంగాణ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. 85% తెలంగాణకే
నూటికి నూరు శాతం తమకే కేటాయించాలంటున్న తెలంగాణ ప్రభుత్వం దక్షిణాదిలోనే మొదటి పర్యావరణ రహిత ఆల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లు మొదటి యూనిట్ కమిషన్ కావడంతో సంబరాలు చేసుకున్న అధికారులు విధాత, కరీంనగర్ బ్యూరో: రామగుండం ఎన్టీపీసీ(NTPC) వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ(Telangana) ప్రాజెక్ట్(Project) మొదటి దశ 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్(Ultra supercritical)యూనిట్ శుక్రవారం తెల్లవారుజామున 0:53. గంటలకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 800 మెగావాట్ల యూనిట్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తును తెల్లవారుజామున […]

- నూటికి నూరు శాతం తమకే కేటాయించాలంటున్న తెలంగాణ ప్రభుత్వం
- దక్షిణాదిలోనే మొదటి పర్యావరణ రహిత ఆల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లు
- మొదటి యూనిట్ కమిషన్ కావడంతో సంబరాలు చేసుకున్న అధికారులు
విధాత, కరీంనగర్ బ్యూరో: రామగుండం ఎన్టీపీసీ(NTPC) వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ(Telangana) ప్రాజెక్ట్(Project) మొదటి దశ 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్(Ultra supercritical)యూనిట్ శుక్రవారం తెల్లవారుజామున 0:53. గంటలకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 800 మెగావాట్ల యూనిట్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తును తెల్లవారుజామున 3:26 గంటల నుండి గ్రిడ్ కు అనుసంధానం చేసి తెలంగాణ ప్రాజెక్ట్ తొలి వెలుగులను రాష్ట్రానికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అనుసరించి ఎన్టీపిసి నుండి 4 వేల మెగావాట్ల(5×800) విద్యుత్ అందించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రామగుండం ఎన్టీపిసి వద్ద తెలంగాణ ప్రాజెక్ట్ ఒకటవ దశకు చెందిన రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులను 2016 జనవరి 29న ప్రారంభించారు. సుమారు10,580 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నుండి పర్యావరణానికి హాని లేకుండా ఉత్పత్తి జరిపేందుకు 275 మీటర్ల ఎత్తుతో చిమ్నీ నిర్మించి అందులో నుండి బొగ్గు, విషవాయువులు గాలిలో కలువకుండా ఎఫ్ జి డి సిస్టం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దక్షిణాదిలోనే మొట్టమొదటిసారిగా అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.
రోజువారి విద్యుత్ ఉత్పత్తికి సరిపడే బొగ్గును సమీప సింగరేణి బొగ్గు గనుల నుండి తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకొని దిగుమతి చేసుకుంటున్నారు. అదేవిధంగా నీటిని సమీప ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వాడుకుంటున్నారు. ప్రాజెక్టు నుండి వెలువడే బూడిదని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఎల్కలపల్లి సమీపంలో నిర్మించిన యాష్ పాండ్‌కు తరలిస్తున్నారు.
ప్రస్తుతం ప్రారంభమైన అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్ 42 శాతం మెరుగైన సామర్థ్యం, ఏకీకృత నియంత్రణ వ్యవస్థ, కంట్రోల్ రూమ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్, ప్లాంట్ భవనాలపై రూప్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు లాంటి పర్యావరణ అనుకూల ఏర్పాటు చేశారు. తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 85% తెలంగాణ అవసరాలకు కేటాయించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో నూటికి నూరు శాతం తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖను అభ్యర్థించింది. ఆ మేరకు లేఖ రాసింది. అయితే దీనిపై తుది నిర్ణయం జరగాల్సి ఉంది.