విజయంతో పెరిగిన పొగరు.. ఆరు క్యాచ్‌లు నేలపాలు చేసి ఓటమి పాలైన ఆఫ్ఘనిస్తాన్

పసికూన ఆప్ఘనిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ని ఓడించి అందరిని ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. అయితే వారిని అందరు ఎక్కువగా పొగిడేసరికి పొగరు తలకెక్కిందో ఏమో కాని ఏకంగా ఆరు క్యాచ్‌లు నేల విడిచి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఒక్క క్యాచ్ మిస్ చేస్తేనే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ ఆరు క్యాచ్‌లు జారవిడిస్తే ఇంక ఎలా గెలుస్తుంది. వన్డే ప్రపంచకప్ 2023లో చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్తాన్ తలపడగా, ఈ మ్యాచ్‌లో చెలరేగిన కివీస్ బ్యాటర్లు 289 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేశారు.
ఫజలక్ ఫరూకీ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్‌ను రెహ్మత్ షా ఫస్ట్ స్లిప్‌లో వదిలేశాడు. ఈ అవకాశం సద్వినియోగపరచుకున్న యంగ్ హాఫ్ సెంచరీతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్లో షాహిది వదిలేశాడు. ఇక రషీద్ ఖాన్ వేసిన 20 ఓవర్ రెండో బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన మరో సునాయ క్యాచ్‌ను కూడా వదిలేశారు. ఇక రషీద్ ఖాన్ వేసిన 41 ఓవర్ చివరి బంతికి టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ వదిలేశాడు. దీంతో లాథమ్ అర్ధ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
ఇలా వచ్చిన అవకాశాలని చేజార్చడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విజయ గర్వం తలకెక్కిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 289 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆఫ్ఘాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 149 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్, వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని టీంలో టాప్‌గా నిలిచింది. ఇక నేడు భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది.