ముంబై ఉగ్ర‌దాడికి 15 ఏండ్లు

ఆర్థిక రాజ‌ధాని ముంబైలో జరిగిన భయంకరమైన 26/11 ఉగ్రదాడికి 15 ఏండ్లు నిండాయి. 2008 నవంబర్ 26న‌ పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు స‌ముద్రమార్గాన ముంబై వ‌చ్చి ఏక‌కాలం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు.

ముంబై ఉగ్ర‌దాడికి 15 ఏండ్లు
  • ఉగ్రదాడిలో వందల మందిని రక్షించిన ఆర్మీ, పోలీస్ అమ‌రులు
  • అమ‌ర‌వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకున్న ప్ర‌ధాన మంత్రి మోదీ



విధాత‌: ఆర్థిక రాజ‌ధాని ముంబైలో జరిగిన భయంకరమైన 26/11 ఉగ్రదాడికి 15 ఏండ్లు నిండాయి. 2008 నవంబర్ 26న‌ పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు స‌ముద్రమార్గాన ముంబై వ‌చ్చి ఏక‌కాలం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, ఇతర లక్ష్యాలపై దాడి చేసి మరపురాని భీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు.


ప్ర‌ఖ్యాత తాజ్ హోటల్ ముట్టడిలో వందలాది మందిని రక్షించి ఐదుగురు ఆర్మీ అమ‌ర‌వీరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రాణాలను కాపాడిన అమ‌రులైన వారి త్యాగాన్నిభార‌త జాతి స్మ‌రించుకున్న‌ది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ సంద‌ర్భంగా వారి సాహ‌సాల‌ను గుర్తుచేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ముంబై ఉగ్రదాడుల గురించి ప్రస్తావించారు. అత్యంత హేయమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కొన్న ఈ రోజును భారతదేశం ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు. ’’నవంబర్ 26ని మనం ఎప్పటికీ మరచిపోలేం. ఈ రోజే మన దేశంపై దారుణమైన దాడి జరిగింది. ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా నివాళి’’ అని మోదీ తెలిపారు.


ముంబై పోలీస్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) తుకారాం ఓంబ్లే చూపించిన తెగువ‌, ధైర్య‌సాహ‌సాలు స‌దా స్మ‌ర‌ణీయం. దాడి స‌మ‌యంలో ముష్క‌రులు గుండ‌వ‌ర్షం కురిపించి (40 సార్లు) కాల్చిశ‌రీరాన్నిజ‌ల్లెడ చేసినా లష్కర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఒంటరిగా పట్టుకోగలిగారు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాద ప్రణాళిక గురించి పలు విష‌యాల‌ను వెల్ల‌డించింది.


మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్


భారత ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి బాధ్యత వహించిన ఎలైట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) యూనిట్‌లో ఒక భాగం. ఆయ‌న‌ ఇతర అధికారులతో హోటల్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదులతో కాల్పులు జరిపారు. ఏకకాలంలో 50 మందికి పైగా బందీలను విడిపించారు. డజన్ల కొద్దీ ప్రాణాలను కాపాడుతుండగా హోటల్‌లో న‌క్కి ఉగ్రవాదులు జ‌రిపిన కాల్పుల్లో అమ‌రుడ‌య్యారు.