BSF Jawan: దిగొచ్చిన పాక్..బీఎస్ఎఫ్ జవాన్ అప్పగింత!

BSF Jawan:: సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తూ దారి తప్పి పాక్ భూభాగంలోకి వెళ్లి పాక్ రేంజర్లకు పట్టుబడిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహును పాకిస్తాన్ ఎట్టకేలకు భారత్ కు అప్పగించింది. ఏప్రిల్ 23న ఫిరోజ్ పూర్ సెక్టార్ లో సరిహద్దులో పహారా కాస్తూ అలసటతో పాక్ భూభాగంలోకి వెళ్లి చెట్టుకింద పడుకున్నాడు. గమనించిన పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్ణమ్ సాహు విడుదల కోసం భారత సైనికాధికారులు పాక్ సైనికాధికారులతో సంప్రదింపుల్లో ఉన్న క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో పూర్ఱమ్ సాహు విడుదల ప్రయత్నాలు స్తంభించాయి.
అటు పాక్ ఆర్మీకి పట్టుబడిన తమ బిడ్డ క్షేమంపై పూర్ణమ్ సాహు తండ్రి బోలేనాథ్ సాహు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తమ కుమారుడికి క్షేమంగా విడిపించాలని భారత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే బీఎస్ఎఫ్ అధికారుల నిరంతర సంప్రదింపుల నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు జవాన్ పూర్ణమ్ సాహు విడుదలకు అంగీకరించారు. ఇరుదేశాల ఫ్లాగ్ షిప్ మీటింగ్ నిర్ణయం మేరకు అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్టు వద్ధ పూర్ణమ్ సాహును భారత్ కు అప్పగించారు. 20రోజుల పాటు పాక్ బలగాల అదుపులోనే ఉన్న పూర్ణమ్ సాహు ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు ఊపిరీ పిల్చుకున్నారు.