Palamuru |
విధాత, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధం అవుతున్నది. 16వ తేదీన సీఎం కేసిఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 6 జిల్లాలకు సాగు నీరు, తాగు నీరు సమస్య తీరనున్నది. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ముఖ్యంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతున్నది. 67.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లు నిర్మించారు. 4 పంపు హౌజ్లలో 145 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం కలిగిన 34 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఏదుల పంప్ హౌజ్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ నిర్మించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మోటర్ రికార్డును తలదన్నేలా 145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటర్లు వినియోగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటున్నది. ప్రపంచంలోనే ఎక్కడ వినియోగించని విధంగా మూడు పంప్ హౌజ్ లలో లో 145 మెగా వాట్ల భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటు చేశారు. అయితే కృష్ణానదిలో 801 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోయవచ్చు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు 60 రోజులు పాటు నీటిని ఎత్తి పోసేలా నిర్మిస్తున్నారు. రోజుకు 1.50టీఎంసీలు లిఫ్ట్ చేయవచ్చు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రత్యేకతలు
ఆయకట్టు: 12.30 లక్షల ఎకరాలు
నీటి వనరు : శ్రీశైలం జలాశయం
లబ్ధిపొందే జిల్లాలు: 6 (నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ)
ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు
లిఫ్ట్ దశలు: 5
రిజర్వాయర్లు: 6
మొత్తం నీటినిల్వ సామర్థ్యం: 67.67 టీఎంసీలు
పంపుల గరిష్ఠ సామర్థ్యం: 145 మెగావాట్లు
నీటిని లిఫ్ట్ చేసే గరిష్ఠ ఎత్తు: 672 మీటర్లు
సొరంగమార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు
ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు
తాగునీటికి వినియోగం: 7.15 టిఎంసిలు
పరిశ్రమల వినియోగానికి: 3 టీఎంసీలు
సాగునీటి కోసం: 79.00 టీఎంసీలు.