Zaheerabad | సరిహద్దులో గెలుపెవ‌రిది? జహీరాబాద్ లోక్ సభ స్థానంపై పార్టీల గురి

Zaheerabad జహీరాబాద్ లోక్ సభ స్థానంపై పార్టీల గురి గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట ఢిల్లీకి సౌండ్ వినిపించాల‌ని బీఆర్ఎస్‌ ఎంపీ సీటు హస్తగతానికి కాంగ్రెస్‌ రెండు పార్టీలకు ఝలక్ ఇవ్వాలని బీజేపీల కసరత్తు విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: జ‌హీరాబాద్‌ ప్రాంతం రెండు రాష్ట్రాలకు స‌రిహ‌ద్దు ప్రాంతం. ఇక్క‌డ ప్ర‌తీది ప్ర‌త్యేక‌మే. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందస్తు రాజకీయ వ్యూహాలను సిద్ధం […]

  • Publish Date - July 13, 2023 / 10:29 AM IST

Zaheerabad

  • జహీరాబాద్ లోక్ సభ స్థానంపై పార్టీల గురి
  • గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట
  • ఢిల్లీకి సౌండ్ వినిపించాల‌ని బీఆర్ఎస్‌
  • ఎంపీ సీటు హస్తగతానికి కాంగ్రెస్‌
  • రెండు పార్టీలకు ఝలక్ ఇవ్వాలని బీజేపీల కసరత్తు

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: జ‌హీరాబాద్‌ ప్రాంతం రెండు రాష్ట్రాలకు స‌రిహ‌ద్దు ప్రాంతం. ఇక్క‌డ ప్ర‌తీది ప్ర‌త్యేక‌మే. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందస్తు రాజకీయ వ్యూహాలను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. గెలుపు గుర్రాల వేటలో ఉన్న పార్టీలు తమ బలహీనతలు…ప్రత్యర్ధి పార్టీల బలాలపై ఫోకస్ పెట్టి అభ్యర్థుల ఖరారుకు కసరత్తు చేస్తున్నాయి.

మ‌రో వైపు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల, ఎంపీల ప‌నితీరు బ‌ట్టే టికెట్లని, అంద‌రి చిట్టా నా ద‌గ్గ‌ర ఉందని చెప్ప‌డంతో సిట్టింగ్ లకు గుబులు ప‌ట్టుకుంది. ఏఏ పార్టీల నుంచి ఏఏ అభ్య‌ర్థులు టికెట్ వేట‌లో ఉన్నారన్న విషయం జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది.

లోక్‌స‌భ స్థానంపై మూడు పార్టీల క‌న్ను

కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లోకసభ నియోజకవర్గం జహీరాబాద్. ఈ లోక్‌సభ స్థానంపై మూడు పార్టీలు కన్నేశాయి. బీఆర్ఎస్‌ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన బీబీ పాటిల్‌.. మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు. హ్యాట్రిక్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఐతే లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. బీబీ పాటిల్‌కు అధిష్టానం మరో అవకాశం ఇస్తుందా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.బీఆర్ఎస్‌ నుంచి టికెట్‌ దక్కపోతే.. తన దారి తాను చూసుకునేందుకు పాటిల్‌ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మదన్‌ మోహన్‌ రావు… మళ్లీ హస్తం పార్టీ తరఫున బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఐతే పీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మదన్ మోహన్ రావుకు కొంత గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు తెరమీదకు వస్తోంది. సనత్‌నగర్ అసెంబ్లీ, జహీరాబాద్ పార్లమెంట్ బరిలో దిగేందుకు అజార్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి నిజామాబాద్‌కు చెందిన లక్ష్మారెడ్డితో పాటు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డిల‌ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి గీతారెడ్డి?

జహీరాబాద్‌లో కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి గీతారెడ్డి మరోసారి బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్న ఏర్పుల నరోత్తమ్‌ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యువ నాయకులను ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తే.. నరోత్తమ్‌ వైపే మొగ్గుచూపే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. జహీరాబాద్‌ కమలం పార్టీలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగం గోపి…. నేరుగా జిల్లా అధ్యక్షుడిపైనే దాడికి దిగి బహిష్కరణకు గురయ్యారు. ఈ మధ్యే బీఆర్ఎస్‌ వీడి బీజేపీలో చేరిన సుధీర్ కుమార్ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తమ్ముడు రామ్ చందర్ కూడా.. జహీరాబాద్‌ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.