‘Harihara Veeramallu’ Trailer | పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదల

విధాత, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. చిత్రబృందం హైదరాబాద్-విమల్ థియేటర్‌లో ట్రైలర్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 50 థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘వీరమల్లు’ ట్రైలర్ విడుదలవ్వడంతో పవన్ అభిమానులు జోష్ మీదున్నారు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో జులై 24న విడుదల కానుంది.
హరిహర వీరమల్లు ట్రైలర్ రెండు నిమిషాల యాభై ఐదు సెకన్ల నిడివితో రిలీజ్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా పాలించిన మొఘల్ రాజు ఔరంగజేబు కు తెలుగు బిడ్డ హరిహర వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడన్నదే చిత్ర ప్రధానాంశంగా భావిస్తున్నారు. కోహినూర్ వజ్రం కూడా సినిమాలో మరో ప్రధానాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్ లో పవన్ కల్యాణ్ చెప్పిన ఇప్పటి దాక మేకలు తినే పులిని మీరు చూసి ఉంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు’ అనే డైలాగ్ తో పాటు ‘నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు.. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు’ అనే డైలాగ్ లు పవన్ నిజజీవితానికి, రాజకీయాలకు ముడిపడినట్లుగా ఉన్నాయి. హరిహర వీరమల్లుగా పవన్ చెప్పిన డైలాగ్ లు పవన్ అభిమానులతో పాటు రాజకీయంగాను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు.
క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం 5ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంది. పవన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం..డిప్యూటీ సీఎం కావడం..వీఎఫ్ఎక్స్ ఆలస్యం వంటి కారణాలతో సినిమా నిర్మాణం, విడుదల ఆలస్యమైంది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మించారు. ఎ.ఎం.రత్నం సమర్పకులుగా ఉన్నారు.